శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (15:30 IST)

రుయా ఆస్పత్రి: కొడుకు మృతదేహాన్ని బైక్‌పై 90 కి.మీటర్లు..?

ruia hospital
ruia hospital
తిరుపతి రుయా ఆస్పత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని బైక్‌పై 90 కి.మీ తీసుకెళ్లాడు.
 
వివరాల్లోకి వెళితే.. రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఓ బాలుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు అంబులెన్స్‌ను పంపారు. ఈ క్రమంలో తమ వాహనంలోనే తీసుకెళ్లాలంటూ రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు పట్టుబట్టారు. 
 
వేరే వాహనంలోకి ఎక్కనీయలేదు. చేసేదేమీలేక కుమారుడి మృతదేహాన్ని తండ్రి బైక్‌పై తమ స్వగ్రామమైన అన్నమయ్య జిల్లా చిట్వేలుకు తీసుకెళ్లారు. బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్‌ సిబ్బంది వ్యవహరించిన తీరు దారుణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
 
ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. "మొన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం. నేడు మరో ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రైవేట్ అంబులెన్స్ దందా కారణంగా అమానవీయ ఘటన. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? చేతగాని పాలకుడు వైఎస్‌ జ‌గన్ గారి చెత్త పాలనతోనే ఇవన్నీ జరుగుతున్నాయి.." అంటూ నారా లోకేష్ ఫైర్ అయ్యారు.  
 
ప్రైవేట్ అంబులెన్స్‌ల ధరలు తట్టుకోలేక బైక్ పైనే రాజంపేట జిల్లాలోని చిట్వేలుకు 90 కి.మీ. మేర బాలుడి మృతదేహాన్ని తరలించారు ఆ తండ్రి. గత తెలుగుదేశం ప్రభుత్వం పార్థివ దేహాన్ని ఉచితంగా తరలించే మహాప్రస్థానం రవాణా వాహనాలను ఏర్పాటు చేసింది.
 
వైసీపీ ప్రభుత్వం మహాప్రస్థానం వాహనాలను నిర్వీర్యం చెయ్యడం కారణంగానే ప్రైవేట్ అంబులెన్స్ దందా పెరిగి ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సీఎం గారు నిద్రలేచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు మెరుగుపర్చాలి" అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.