బీమా కాసుల కోసం కక్కుర్తిపడి... శవాన్ని కారుతో తొక్కించి...
ఓ బీమా ఏజెంట్ కాసుల కోసం కక్కుర్తిపడ్డాడు. ఫలితంగా మానవత్వాన్ని కూడా విస్మరించాడు. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బీమా డబ్బు కోసం కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి అతను చేసి
ఓ బీమా ఏజెంట్ కాసుల కోసం కక్కుర్తిపడ్డాడు. ఫలితంగా మానవత్వాన్ని కూడా విస్మరించాడు. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని బీమా డబ్బు కోసం కారుతో ఢీకొట్టి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి అతను చేసిన ప్రయత్నం విఫలమైంది. ఫలితంగా ఊచలు లెక్కిస్తున్నాడు. గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే,
నల్గొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతానికి చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న కస్నానాయక్(56) అనే వ్యక్తి గుంటూరు జిల్లా తెనాలి రూరల్ మండలం పెదరావూరులో నివాసముంటున్నాడు. బంధువు శ్రీనివాస్ ద్వారా బీమా ఏజెంటు రాజునాయక్ (మిర్యాలగూడెం) ఈ కుటుంబానికి పరిచయమయ్యాడు. కస్నానాయక్ పేరిట బీమా కడితే అతను చనిపోయిన తర్వాత డబ్బు వస్తుందని నమ్మించాడు. తొలి ఏడాది ప్రీమియం కింద రూ.1510లను తనే చెల్లించాడు. బీమా పరిహారం వస్తే అతనికి 60 శాతం, బంధువులకు 40 శాతం వచ్చేలా ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇందుకోసం రోగితో పాటు కుటుంబ సభ్యుల వేలి ముద్రలనూ తీసుకున్నారు. ఇదంతా ఈనెల 7న జరిగింది. ఈ నేపథ్యంలో కస్నానాయక్ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. వెంటనే అతని భార్య, ఇద్దరు అల్లుళ్లు ఈ విషయాన్ని రాజునాయక్‌కు ఫోన్ చేసి చెప్పారు. అతను కారులో శ్రీనివాస్‌తో పాటు మరో మిత్రుడిని కూడా తోడు తీసుకుని పెదరావూరు వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని నమ్మిస్తే బీమా కింద రూ.10 లక్షలు వస్తాయని చెప్పాడు.
అల్లుడికి చెందిన ఆటోలో కస్నానాయక్‌ను వైద్యశాలకు తీసుకువెళుతూ ఉంటే మార్గమధ్యలో జారిపడినట్టుగా, అతని మీద నుంచి కారుపోయినట్లుగా చిత్రీకరించాలన్నది బీమా ఏజెంట్ ప్లాన్. మల్లెపాడు రోడ్డులో జన సంచారం లేనిచోట మృతదేహాన్ని రోడ్డు మీద పడేసి... దాని మీద నుంచి కారు పోనిచ్చారు. అనంతరం తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు చెప్పారు.
అయితే, మృతదేహాన్ని నిశితంగా పరిశీలించిన వైద్యులకు ఓ సందేహం వచ్చింది. ఆ వ్యక్తి ప్రమాదంలో చనిపోయినట్లుగా లేదని గుర్తించారు. విషయాన్ని పోలీసులకు చేరవేయగా, వారు వచ్చి ఒక అల్లుడిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇవ్వడం, రాజునాయక్‌ను విచారించడంతో అన్ని విషయాలు బయటకు వచ్చాయి. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.