శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 అక్టోబరు 2019 (13:18 IST)

బీజేపీ తీర్థం పుచ్చుకున్న ఆదినారాయణరెడ్డి..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీకి చెందిన పలువురు సిట్టింగ్‌లు, ముఖ్య, కీలకనేతలు ఆ పార్టీకి టాటా చెప్పేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఏపీ మాజీ మంత్రి, టీడీపీ కీలక నేత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. సోమవారం ఉదయం బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పుకున్నారు. 
 
ఈ సందర్భంగా బీజేపీ కండువా కప్పిన నడ్డా సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆదినారాయణరెడ్డి 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.
 
2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరిగింది. 
 
ఇటీవలి కాలంలో బీజేపీలో చేరేందుకు ఓసారి ఢిల్లీ వెళ్లారు. కొన్ని కారణాల వల్ల అప్పట్లో జాయిన్‌ కాలేదు.. అయితే సోమవారం నాడు ఢిల్లీ వేదికగా జేపీ నడ్డా సమక్షంలో ఆది కాషాయ కండువా కప్పేసుకున్నారు. కాగా కడప జిల్లాలో టీడీపీ కీలకనేతగా ఉన్న ఆది బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆ పార్టీకి షాక్ తగిలినట్లైంది.