కల్నల్ సంతోష్ బాబుకు మహావీర్ చక్ర.. ఆ అవార్డు ఇచ్చి వుంటే బాగుండేది..?
కల్నల్ సంతోష్ బాబుకు కేంద్ర ప్రభుత్వం మహావీర్ చక్ర ప్రకటించింది. తెలంగాణ సూర్యాపేటకు చెందిన సంతోష్ బాబు బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా ఉన్నారు. గత ఏడాది జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచితంగా పోరాడి అమరుడయ్యారు. నాటి ఘటనలో కల్నల్ సంతోష్‌బాబుతో పాటు మొత్తం 20 మంది సైనికులు అమరులయ్యారు.
బీహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారిగా సంతోష్‌బాబు వ్యవహరించారు. గతేడాది జూన్ 15న గల్వాన్ లోయ వద్ద చైనా దురాక్రమణకు ప్రయత్నించింది. భారత సేనలు దీనిని తీవ్రంగా ప్రతిఘటించాయి. వారిని ధీటుగా ఎదుర్కొని తిప్పికొట్టాయి.
ఈ దాడిలో భారత్‌కు చెందిన 21 మంది జవాన్లు అమరులయ్యారు. వీరిలో కల్నల్ సంతోష్‌బాబు ఒకరు. భారత సైనికుల దాడిలో చైనా వైపు కూడా భారీ ప్రాణనష్టం జరిగింది. సంతోష్‌బాబు దేశానికి అందించిన సేవలకు గౌరవంగా కేంద్ర ప్రభుత్వం మరణానంతరం మహవీరచక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
అయితే ఈ విషయం పై కల్నల్ సంతోష్ బాబు తండ్రి బిక్కుమళ్ల ఉపేందర్ ఎన్టీవీతో మాట్లాడుతూ... కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా, గర్వముగా ఉంది. కానీ కొద్దిగా అసంతృప్తిగా ఉంది. పరమ వీర చక్ర పురస్కారం కల్నల్ సంతోష్ బాబుకు రావడానికి అన్ని అవకాశాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము. మహావీర చక్ర పురస్కారం తక్కువేమి కాదు. దీనివల్ల మా కుటుంబానికి గౌరవం. సంతోష్ బాబు త్యాగానికి అరుదైన పురస్కారం దక్కింది. కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం దక్కినట్లు మాకు రాత్రి వాట్సప్‌లో లెటర్ పెట్టారు.
ఈరోజు మహావీర చక్ర పురస్కారం మాకు ప్రదానం చేస్తామని చెప్పలేదు..ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్లి మహా వీర చక్ర పురస్కారం తీసుకుంటాం. మహా వీర చక్ర పురస్కారం చూశాక మావాడి శక్తి సామర్ధ్యాలు ధైర్య సాహసాలు తెలుస్తున్నాయి. ఎంతోమంది యువతకు స్ఫూర్తి రగిల్చాడు కల్నల్ సంతోష్ బాబు. 15 ఏళ్ల సర్వీస్ లో 10 ఏళ్ళు ఫీల్డ్ సర్వీస్ చేశాడు ఆర్మీలో పని చేసే అవకాశం అందరికిరాదు సంతోష్ బాబుకు వచ్చింది.
ఇక కల్నల్ సంతోష్ తల్లి మంజుల మాట్లాడుతూ... కల్నల్ సంతోష్ బాబుకు మహావీర చక్ర పురస్కారం దక్కడం సంతోషంగా ఉంది. సంతోష్ బాబు త్యాగానికి పరమవీర చక్ర ఇస్తే ఓ తల్లిగా ఇంకా సంతోష పడేదాన్ని అన్నారు.