ఉరివేసుకుని చావుబతుకుల మధ్యవున్న తోబుట్టువు ప్రాణాలు 'తాగే'శారు...
కుటుంబ అనుబంధాలకు, సోదర బంధానికి మచ్చతెచ్చే ఈ హృదయ విదారక సంఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. తాగుబోతు అన్నల వేధింపులు భరించలేక ఓ తోబుట్టువు దూలానికి ఉరివేస
కుటుంబ అనుబంధాలకు, సోదర బంధానికి మచ్చతెచ్చే ఈ హృదయ విదారక సంఘటన హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. తాగుబోతు అన్నల వేధింపులు భరించలేక ఓ తోబుట్టువు దూలానికి ఉరివేసుకుంది. ఆమె రక్షించాల్సిన అన్నలు... ప్రాణాలు పోతుంటే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
బీకేగూడకు చెందిన దంపతులు యూసుఫ్ - షాహెదాలకు ముగ్గురేసి కుమారులు, కుమార్తెలు. వారిలో అయిదో సంతానం సబా(15). కుటుంబంలో తల్లిదండ్రులతోపాటు ముగ్గురు అన్నలు ఆజం, ముక్రం, కరీంలకు తాగుడు అలవాటుంది. ఇళ్లల్లో పనిచేసి కుటుంబానికి చేదోడుగా ఉంటున్న సబాను తాగుడు కోసం వారంతా వేధించేవారు. ఆమె పనిచేస్తున్న ఇళ్లకు వెళ్లి, సబా వేతనాన్ని ముందుగానే తీసుకునేవారు. సబాకు పని డబ్బులు రూ.1500 వచ్చాయి. తాగేందుకు ఆ డబ్బివ్వమని అన్నలంతా ఆమెను తీవ్రంగా కొట్టారు. మనస్తాపానికి గురైన ఆ అభాగ్యురాలు ఇంట్లో అంతా ఉండగానే ఉరి వేసుకుంది.
ఈ విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు కుటుంబసభ్యులకు చెప్పడంతో దూలానికి వేలాడుతున్న సబాను కిందకు దించారు. కొన ఊపిరితో ఉన్నా ఆసుపత్రికి తీసుకుపోకుండా అక్కడే ఉంచారు. ఇరుగుపొరుగు సబా అన్నల్లో ఒకరికి రూ.100 ఇచ్చి ఆటోను తీసుకుని రావాలని చెప్పినా.. అతగాడు ఆ డబ్బులతో పీకల వరకు మద్యం సేవించి వచ్చాడు. చివరకు స్థానికులే 108 అంబులెన్స్‌లో బాధితురాలిని రాత్రి 11.30గంటలకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించినా, అప్పటికే సబా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.