తిరుమలలో వేడుకగా స్వర్ణరథోత్సవం
తిరుమల శ్రీవారి ఆలయంలో విశేషమైన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శుక్రవారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఉదయం 9 నుండి 11 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని తిరుమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు.
టిటిడి మహిళా ఉద్యోగులతోపాటు మహిళలు పాల్గొని రథాన్ని లాగారు. ఆలయ మాడ వీధుల్లో స్వర్ణరథంపై విహరించిన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని గ్యాలరీల్లో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందనామస్మరణతో మాడ వీధులు మారుమోగాయి.
శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పాలంకరణ
శ్రీవారి ఆలయంలో ఏర్పాటుచేసిన పుష్పాలంకరణలు ఆకట్టుకున్నాయి. మహద్వారం నుంచి ధ్వజస్తంభం వరకు, వైకుంఠ ద్వారంలో సంప్రదాయం ఉట్టిపడేలా చెరకుగడలు, పలురకాల పండ్లు, సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలు, పత్రాలతో శోభాయమానంగా అలంకరణలు చేపట్టారు.
డిసెంబరు 26న వైకుంఠ ద్వాదశినాడు చక్రస్నానం
వైకుంఠద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని డిసెంబరు 26న శనివారం ఉదయం 4.30 నుండి 5.30 గంటల నడుమ స్వామి పుష్కరిణిలో శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం జరుగనుంది.
ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు డిపి.అనంత, డా.నిశ్చిత, కుమారగురు, సివిఎస్వో గోపినాథ్‌జెట్టి, అదనపు సివిఎస్వో శివకుమార్‌రెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, విజివో బాలిరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.