శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 11 అక్టోబరు 2021 (17:36 IST)

కమిషన్ల కోసం మార్కెట్లో రూ.6 నుండి రూ.11 పెట్టి విద్యుత్ కొనుగోలు

ఏపీలో విద్యుత్ సంక్షోభానికి, గత తెలుగుదేశం, ప్రస్తుత వైకాపా ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ ధ్వజమెత్తారు. తక్కువ ధరకు విద్యుత్ కొనే అవకాశం ఉన్నా, కమిషన్ల కోసం ఆశపడి ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
 
 విద్యుత్ నిర్వహణలో విద్యుత్ కొనుగోళ్ళే కీలక మని, కాకపోతే 2014–19 మధ్య అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. 2014లో రూ.33,500 కోట్లు ఉన్న విద్యుత్ రంగం అప్పులు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డగోలుగా జరిపిన ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్ళు, అవినీతి కారణంగా 2019 మార్చి చివరినాటికి రూ.70,250 కోట్లకు చేరాయని, విద్యుత్ సంస్థల చెల్లింపులు రూ.2,893 కోట్ల నుంచి ఏకంగా రూ.21,500 కోట్లకు చేరాయని, విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.19920 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయన్నారు. 
 
 ప్రయివేటు సౌర, పవన విద్యుత్ కొనుగోళ్ళను అవసరానికి మించి ప్రోత్సహించి సోలార్ యూనిట్ కు రూ. 5.25 నుంచి రూ.5.90 వరకూ చెల్లించేలా, అది కూడా పాతికేళ్ల పాటు అమల్లో ఉండేలా దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుందని, అంతటితో ఆగకుండా ఆయా ప్రయివేటు విద్యుత్ సంస్థలు చెల్లించే ఆదాయపు పన్నును, ఎలక్ట్రిసిటీ డ్యూటీని తిరిగి వాళ్లకు రిఫండ్ ఇచ్చేలా ఒప్పందం చేసుకుందని శైలజనాథ్ ఆరోపించారు. ఇవి కూడా కలిపితే యూనిట్ విద్యుత్ ఖరీదు చాలా ఎక్కువని, ఫలితంగా విద్యుత్ సంస్థలపై మోయలేని భారం పడిందని, పవన విద్యుత్ కు యూనిట్ కు రూ. 4.84 చొప్పున చెల్లించేలా ఏకంగా 41 విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుందన్నారు. ఈ ధరకు ఆదాయపు పన్ను, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రీఫండ్ అదనం అని తెలిపారు. 
 
 ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని, అందువల్లే ఈ సర్దుబాటు చార్జీలు వసూలు చేయడానికి అనుమతించాలని కమిషన్ నిర్ణయించిందని విద్యుత్ నియంత్రణ మండలి తన ఉత్తర్వుల్లో పేర్కొందన్నారు.  2019 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) రూ.12,539 కోట్లు నష్టంలోనూ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ రూ.7,745 కోట్ల నష్టంలోనూ ఉన్నాయని, మరోవైపు 2014లో రాష్ట్ర విభజన జరిగిన నాటికి రూ.12,500 కోట్లు వున్న కొనుగోలు బకాయిలు, నిర్వహణ వ్యయ రుణాలు 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరుకున్నాయన్నారు. 
 
ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా తగ్గడంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు ఉత్పత్తి కార్పొరేషన్ (ఏపీజెన్కో) ఉక్కిరిబిక్కిరి అవుతోందని, దాదాపు రూ.6000 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని డిస్కమ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోందని శైలజనాథ్  వివరించారు. థర్మల్ విద్యుత్తు సంస్థలు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తీసుకున్న దాదాపు రూ.20,000 కోట్ల రుణాలకు వడ్డీలు, వాయిదాలను చెల్లించాల్సి వస్తోందని. విద్యుత్ పంపిణీ చేస్తున్నా వసూళ్లు మాత్రం లేకపోవడంతో ఏపీజెన్కో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,  కోవిడ్ తర్వాత విద్యుత్ వినియోగం 2019తో పోలిస్తే 2021లో దేశవ్యాప్తంగా 18 శాతం, ఏపీలో 20 శాతం పెరిగిందన్నారు. ఒకవేళ కోవిడ్ లేకపోతే జరిగే వినియోగం కంటే ఇది 8 శాతం ఎక్కువ. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకి వినియోగిస్తున్న 190 మిలియన్ యూనిట్లలో 80 మి.యూనిట్ల విద్యుత్ ఏపీ జెన్కో ద్వారా అందుతోంది. 
 
ప్రస్తుతం జెన్కో ఉత్పత్తి 50 శాతం (40 మి.యూ)కి పడిపోయింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల నుంచి రోజుకు 40 మి.యూ విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా అందులో 75 శాతం (30 మి.యూ) మించి ఉత్పత్తి అవ్వట్లేదు. జల విద్యుత్ ఉత్పత్తి 25 మిలియన్ యూనిట్ల వరకే చేయగలం. రోజుకి 15 మి.యూ సౌర విద్యుత్ వస్తోంది. 30 మి.యూ పవన విద్యుత్ ఉత్పత్తి అవ్వాల్సి ఉండగా కేవలం 5 నుంచి 10 మి.యూనిట్లకే పరిమితమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన విద్యుత్ సబ్సిడీ విద్యుత్ సంస్థలకు తగినంతగా ఇవ్వలేదని, దేశవ్యాప్తంగా విద్యుత్ రేట్లు తగ్గుతున్నా, విద్యుత్ కొనుగోలు ధర రూ.3.12కే లభిస్తున్నదని, అయినా  జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కమిషన్ల కోసం మార్కెట్లో రూ.6 నుండి రూ.11 పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారన్నారు. ఈ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నారని,  ప్రభుత్వ విద్యుత్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం మేరకు విద్యుత్ ఉత్పత్తి చేయించి వుంటే మార్కెట్లో విద్యుత్ కొనాల్సిన అవసరం వుండేది కాదని,  మన రాష్ట్రమే ఇతర రాష్ట్రాలకు అమ్మగలిగే స్థితిలో ఉండేదన్నారు. విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే దృష్టి పెట్టి  గాడిలో పెట్టాలని శైలజనాథ్ సూచించారు.