ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 అక్టోబరు 2020 (23:26 IST)

ప్రవేట్ విద్యాసంస్థలను, సిబ్బందిని ప్రభుత్వం ఆదుకోవాలి: ప్రవేటు విద్యాసంస్థల జెఏసి ప్రతినిధులు

లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలోని అన్ని ప్రవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయని అందువల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రవేటు విద్యాసంస్థల యజమానులతో పాటుగా అందులో పనిచేస్తున్న సిబ్బందిని ప్రభుత్వం సహృదయంతో ఆదుకోవాలని ప్రవేటు విద్యాసంస్థల జెఏసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలోని ప్రవేటు విద్యాసంస్థలను నిర్వహిస్తున్న యజమానులతో ఏర్పాటైన సంఘాల ప్రతినిధులందరూ రాష్ట్ర జెఎసీగా ఏర్పడి శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అన్ ఎయిడెడ్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ ( ఎపిపియుఎస్ఎంఎ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.తులసీ విష్ణు ప్రసాద్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ కు ప్రకటించినట్లుగానే సిలబస్ పనిదినాల సంఖ్యతో కూడిన అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించాలన్నారు.

ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పై కూడా స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం తెలియజేయాలన్నారు. తగ్గించిన సిలబస్ ను స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల ఉ పాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఒక అవగాహన ఏర్పడి దానికి తగినట్లుగా పాఠశాలలకు పిల్లలను పంపడం జరుగుతుందన్నారు. పాఠశాల స్థాయిని బట్టి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించి ప్రభుత్వం తమను ఆదుకోవాలన్నారు.

ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకున్న మాదిరిగానే ప్రవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లోని ఉ పాధ్యాయులను ఆదుకోవాలని కోరారు. ప్రవేటు విద్యా సంస్థల్లోని తెల్లరేషన్ కార్డుదారులకు కూడా జగనన్న విద్యా కానుక అందచేయాలని సూచించారు. ఒక సంవత్సరం పాటు స్కూల్ రెన్యూవల్ ను వాయిదా వేయాలని కోరారు.

గత విద్యాసంవత్సరానికి సంబంధించిన పూర్తి ఫీజులను చెల్లించిన తర్వాత తమ దగ్గర ఉన్న చెల్డ్ ఇఫ్లోలో విద్యార్థి పేరు తొలగించిన తర్వాత టీసీ ఇస్తామని ఇప్పుడు ఆ విధానంలో ప్రభుత్వం మార్పులు చేస్తుందని ఇది సరికాదని, దీనిపై ప్రభుత్వం విద్యాశాఖాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. 
 
ప్రవేటు విద్యా సంస్థలను మూడు కేటగిరిలుగా చేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వి.సుందర్ రావ్ ప్రవేటు విద్యా సంస్థలను కార్పోరేట్, బడ్జెట్ , సెమీ బడ్జెట్ గా అనే మూడు కేటగిరిలుగా విభజించి బడ్జెట్, సెమీ బడ్జెట్ స్కూల్స్ కు ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. తమ సమస్యలను ప్రభుత్వం అవగాహన చేసుకుని పరిష్కరించాలన్నారు. బడ్జెట్ స్కూల్ లో వసూలు చేస్తున్న ఫీజులను ఫీజు రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ పర్యవేక్షణ నుంచి తొలగించాలని ఆయన అన్నారు.
 
గాజువాక ఇండిపెడెంటెండ్ ప్రవేటు స్కూల్ అసోసియేషన్ (జిఐపిఎస్ఎ) నాయకుడు పి.భాస్కరరావు మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో పాఠశాలలు మూసి వేసి ఉన్నాయని అందువల్ల ఉపాధ్యాయుల జీతాలు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు.

ప్రభుత్వం వసూలు చేస్తున్న వివిధ రకాల పన్నులు, బ్యాంకు నుంచి తీసుకున్న రుణాల వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని, వీటితో పాటుగా విద్యుత్ టారిఫ్ ను కూడా కేటగిరి 2 నుంచి మార్చాల్సిందిగా ఆయన కోరారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేదంటే ఆత్మహత్యలే శరణ్యమని భాస్కర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్ స్కూల్స్ బలోపేతం చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
 
విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ( ఐసీఎస్ అండ్ టీఏ ) నాయకుడు ఏం.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి నుంచి విద్యాసంస్థల బస్సులు నడపలేదని, వాటికి సంబంధించిన రోడ్ ట్యాక్స్ కు, ఇన్యూరెన్స్ పాలసీలను స్టాపెజ్ పిరియడ్ గా పరిగణించి మినహాయింపు ఇవ్వాల్సిందిగా కోరారు.

ఫైనాన్స్ కంపెనీలు కూడా ఈఎంఐలు చెల్లించాలని తమపై ఒత్తిడి తెస్తున్నాయని, ఫైనాన్స్ కంపెనీలు తమపై ఒత్తిడి చేయకుండా ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వాలన్నారు. బస్సుల లైఫ్ పిరియడ్ 15 సంవత్సరాలని , ఈ ఎనిమిది నెలలు బస్సులు నడపలేదు కాబట్టి ఈ 8 నెలలను మినహాయింపు ఇచ్చి స్కూల్ బస్సుల లైఫ్ టైమ్ ను 16 సంవత్సరాలుగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
 
 కడప రికగ్నైజైడ్ అన్ ఎయిడెడ్ మేనేజ్ మెంట్ స్కూల్స్ అసోసియేషన్ నాయకుడు, ఎపి.జెఎసి ఛైర్మన్ ఎల్ . జోగిరామిరెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ కారణంగా ప్రవేటు విద్యారంగం చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం అన్ని సౌకర్యాలను పరిశీలించిన తర్వాతే తమ స్కూలకు గుర్తింపు ఇచ్చారని ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ సమయంలో తనిఖీల పేరుతో ఇబ్బందులను గురి చేయడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేటు విద్యాసంస్థలకు అన్యాయం చేస్తారని తాము అనుకోవడం లేదని, కాని విద్యాశాఖలోని కొంత మంది అధికారులు ముఖ్యమంత్రికి తెలియకుండా అడ్డగోలుగా జీ.వో.లు తెచ్చి ప్రవేటు విద్యాసంస్థలకు చెందిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రామిరెడ్డి ఆరోపించారు. ప్రవేటు విద్యాసంస్థలకు చెందిన యజమానులుతో పాటుగా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్ మెంట్స్ అసోసియేషన్ ( ఐఎస్ఎంఎ ) నాయకుడు కె.శ్రీకాంత్ , అమరావతి రికగ్నైజ్ స్కూల్స్ అసోసియేషన్ ( ఎఎఆర్ఎస్ఏ ) నాయకుడు ఏం . అప్పాజీ, తూర్పు గోదావరి జిల్లా ప్రవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు ఎమ్.విజయ్ కుమార్, కృష్ణాజిల్లా అపుస్మా అధ్యక్షుడు అనీల్ కుమార్, కృష్ణాజిల్లా అప్పా అధ్యక్షులు మోహన్ రావుతో పాటు 13 జిల్లాల ప్రవేట్ పాఠశాల సంఘం నాయకులు పాల్గొన్నారు.