ఏపీ మంత్రివర్గం నుంచి మంత్రి గుమ్మనూరు జయరాం బర్తరఫ్
అందరూ ఊహించిందే జరిగింది. ఏపీలో అధికార వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంను ఏపీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ మేరకు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీచేశారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా పోటీ చేయాలని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి.. మంత్రి జయరాంకు సూచించారు. కానీ, ఈ ప్రతిపాదన పట్ల మంత్రి జయరాం తీవ్ర అసంతృప్తితో కొనసాగుతూ, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
అదేసమయంలో టీడీపీలో చేరేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలు చేశారు. ఇవి ఫలించడంతో పసుపు కండువా కప్పుకున్నారు. మంగళవారం మంగళగిరి వేదికగా జరిగిన బీసీ సభలో ఆయన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గం నుంచి జయరాంను బర్తరఫ్ చేయాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గవర్నర్‌కు సిఫార్సు చేశారు. దీంతో గవర్నర్ అబ్దుల్ నజీర్ బర్తరఫ్ చేశారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ అయింది.