శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 25 ఏప్రియల్ 2018 (11:27 IST)

అర్థాంతరంగా ముగిసిన గవర్నర్ నరసింహన్ ఢిల్లీ టూర్

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తిన పర్యటన అర్థాంతరంగా ముగిసింది. మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ఆయన... బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ హస్తిన పర్యటన అర్థాంతరంగా ముగిసింది. మంగళవారం ఢిల్లీకి చేరుకున్న ఆయన... బుధవారం ఉదయం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
 
నిజానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీకి వెళ్లారు. ఈ పర్యటన సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్ సింగ్, మరికొంతమంది కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కావాల్సివుంది. 
 
అయితే, మంగళవారం రాత్రే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమైనట్టు అనధికార వర్గాల సమాచారం. దీనికి కారణం... ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లనుండటంతో బుధవారం సమయం కేటాయించలేని పరిస్థితి ఉండటంతో మంగళవారం రాత్రే ఈ సమావేశం ముగినట్టు సమాచారం. 
 
వాస్తవానికి గవర్నర్ నరసింహన్ తన పర్యటనలో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌నాథ్‌సింగ్‌తో.. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధానితో సమావేశమయ్యేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా తీసుకున్నారు. అయితే బుధవారం ఉదయం తన పర్యటనను అర్ధాంతరంగా ముగించుకుని గవర్నర్‌ హైదరాబాద్‌ పయనమయ్యారు. అయితే దీనికి వాస్తవ కారణాలు తెలియరాలేదు. 
 
అంతకుముందు గవర్నర్ నరసింహన్ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వేర్వేరుగా సమావేశమై తాజా పరిస్థితులపై చర్చించారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల్లో నెలకొనివున్న తాజా రాజకీయ పరిస్థితులపై ఒక నివేదికను తయారు చేశారు. ఈ నివేదికలను ఢిల్లీకి సమర్పించేందుకే ఆయన హస్తినకు వెళ్లినట్టు సమాచారం.