ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2023 (10:32 IST)

మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్న 60 మందిపై పోలీసుల కేసు

appolice
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా గుంటూరులో టీడీపీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన మోత మోగిద్దాం అనే కార్యక్రమంలో పాల్గొన్న నాయకులపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసారు. అనుమతి లేకపోయినా తప్పెట్లు, కంచాలు మోగిస్తూ విజిల్స్ వేస్తూ వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ కృష్ణమూర్తి, మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, టీడీపీ నేత మాన శ్రీనివాస రావుతో సహా ఏకంగా 60 మందిపై గుంటూరులోని పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిందరూ విచారణకు హాజరుకావాలని త్వరలోనే నోటీసులు అందజేస్తామని వారు తెలిపారు.
 
మరోవైపు, ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. "విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మంది పై కేసా? పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తారా? వీళ్ళ తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబుగారి అరెస్టు వార్తలు చూశారని, పసుపు రంగు దుస్తులు వేసుకున్నారనీ, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి... ఉరిశిక్ష వేసేయండి. జగన్‌కి పిచ్చి పీక్స్‌లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే... అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది?' అంటూ ట్విట్టర్ ఖాతాలో కామెంట్స్ చేశారు.