ఇదీ ఒక సీఐ గారి రైస్‌మిల్ బాగోతం. మిల్లులో భాగస్వామ్యం అంటూ ప్రజల సొమ్మును కొల్లగొట్టారు. సుప్రియ పేరుతో రైస్‌మిల్ పెడుతున్నా.. పెట్టుబడి పెడితే షేర్‌లు ఇస్తా.. దీంతో పాటు మిల్లులో ఉద్యోగం ఇస్తామని నమ్మబలికారు కోట్లాది రూపాయలు వసూలు చేశారు. మిల్లు తెరుచుకుంది. సంపాదన బాగానే ఉంది. అందుకు పెట్టుబడి పెట్టిన వారికి, అప్పులిచ్చిన వారికి మాత్రం ఇప్పటికీ షేర్లు రాలేదు సరికదా ఉద్యోగాలు వచ్చిందీ లేదు. ఇదంతా చేసింది ఒక పోలీసు అధికారి. ఓ నాలుగు కేసులు ఆయనపైనా, మరో రెండు కేసులు ఆయన భార్యపైనా నమోదయ్యాయి.
గుంటూరు రేంజ్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బత్తుల శ్రీనివాసరావు ఎస్‌ఐ, సీఐగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయన పలు ఆరోపణల నేపథ్యంలో సస్పెన్షన్‌లో ఉన్నారు. ఖాకీ దుస్తులను అడ్డుపెట్టుకుని నిలువు దోపిడీకి తెరదీశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధనలకు నీళ్లొదిలేశారు. రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో రైస్‌మిల్లు కడుతున్నానంటూ జనం నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలొచ్చాయి.
గుంటూరు శ్రీనివాసరావుతోటకు చెందిన బండ్లమూడి బిందు వద్ద 2016 సంవత్సరంలో రూ. 1 కోటి 40 లక్షలు అప్పుగా తీసుకుని, ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో బాధితురాలు నగరంపాలెంలో పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో ఆయనతోపాటు భార్యపైనా కేసు నమోదైంది.
తెనాలికి చెందిన యండ్రాతి చంద్రమ్మ అనే మహిళ వద్ద 2018 సంవత్సరంలో రూ.15 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారనే ఫిర్యాదు మేరకు టూటౌన్‌లో కేసు నమోదైంది. విశాఖపట్నంలోని గాజువాకలో తనకు బంధువైన ఏలిషా వద్ద రూ.29 లక్షల వరకు తీసుకుని మోసం చేయటంపై గాజువాక పీఎస్‌లోనూ కేసు నమోదైంది. తన రైస్‌మిల్లుకు సంబంధించి షేర్‌లు ఇస్తామని నమ్మబలికి అతన్ని మోసం చేయటంపై ఫిర్యాదు చేశాడు.
గుంటూరు నగరంలో నివాసం ఉండే పాపాబత్తుల ప్రభుదాస్ విద్యుత్ శాఖలో లైన్‌మెన్‌గా పనిచేశారు. ఈ క్రమంలో పరిచయమైన సీఐ బత్తుల శ్రీనివాసరావు అతని రైస్‌మిల్లులో షేర్‌లు ఇవ్వటంతో పాటు, సూపర్‌వైజర్‌గా ఉద్యోగం ఇస్తా మని నమ్మబలికి రూ.34 లక్షల 84 వేల నగదును తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు. అయితే ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని బాధితుడు వాపోతున్నాడు.
పల్నాడు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే విధంగా షేర్ ఇస్తామని, తన బినామీల ద్వారా రూ.25 లక్షలు వరకు తీసుకున్నారని, అందులో ఆయనే సాక్షిగా ఉన్నారని బాధితుడు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
డబ్బులు తీసుకున్న ఏ ఒక్కరికీ తిరిగి ఇవ్వకపోగా, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలుస్తోంది. సీఐ స్థాయిలో ఉన్న శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేసినప్పటికీ, ఉన్నతాధికారులు తప్ప, స్టేషన్ అధికారులు పట్టించుకోవటం లేదు.
నేను రిటైర్ అవ్వగానే వచ్చిన డబ్బులన్నీ సీఐ బత్తుల శ్రీనివాసరావుకే ఇచ్చా. నా జీవితకాలం కష్టం తీసుకెళ్లి ఆయనకిచ్చా. కుటుంబ పెద్దగా రిటైర్‌మెంట్ తరువాత ఏదో వ్యాపారం చేద్దామకున్నా.. తప్ప, పోలీసు అయి ఉండి ఆయన మోసం చేస్తారని అనుకోలేదు. నా డబ్బులు, మిగిలిన బాధితులకు తిరిగి డబ్బులు తిరిగి ఇప్పించాలని గుంటూరు శ్రీనగర్ కి చెందిన పాపాబత్తుల ప్రభుదాస్ చెపుతున్నారు.
దీనిపై డిఐజీ తివిక్రమవర్మ ను వివరణ కోరగా, సీఐ హోదాలో ఉన్న బత్తుల శ్రీనివాసరావుపై పలు కేసులు నమోదైన మాట వాస్తవమే. పూర్తిస్థాయిలో కేసులు విచారిస్తున్నాం. ఆరోపణల నేపథ్యంలోనే బత్తుల శ్రీనివాసరావును సస్పెండ్ చేశాం. గుంటూరు జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. మరెవరైనా బాధితులు ఉన్నారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నాం అని చెప్పారు.