పెళ్లి పేరుతో కేటుగాడి ఎర.. బాధితుల్లో విశాఖ వైద్యురాలు
పెళ్లిళ్ళ పేరుతో పలువురు యువతులను మోసం చేస్తూ వచ్చిన ఓ కేటుగాడిని పోలీసులు అరెస్టు చేసి జైలు ఊచలు లెక్కించేలా చేశారు. తనకు రూ.100 కోట్ల ఆస్తి ఉందని ఓ మ్యాట్రిమోనీ సైటులో అందమైన ఫోటోలతో ప్రచారం చేస్తూ అనేక మంది అమ్మాయిలను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేస్తూ వచ్చాడు. ఆ కేటుగాడి చేతిలో మోసపోయిన వారిలో విశాఖకు చెందిన వైద్యురాలు కూడా ఉన్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. గుంటూరుకు చెందిన ఓ యువతి లండన్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. ఆమెకు వివాహం చేయాలని తల్లి ప్రయత్నాలు చేస్తోంది. విషయం తెలిసిన హైదరాబాద్‌కు చెందిన ఈ యువకుడు తాను పెళ్లి చేసుకుంటానని ఆస్తి, జీతంపై మాయమాటలు చెప్పాడు.
గుంటూరులో ఇల్లు కొనేందుకు రూ.కోటి పంపుతానన్నాడు. ముందుగా తమ మధ్య బ్యాంకు లావాదేవీలు జరగాలని చెప్పాడు. అలా విడతల వారీగా రూ.25 లక్షలు జమ చేయించుకున్నాడు. ఇల్లు కొనే ప్రక్రియలో భాగంగా యజమాని డబ్బులు అడిగారు.
ఒక్కసారిగా రూ.కోటి ఇవ్వకూడదని, ముందు తన ఖాతాలోకి రూ.2 లక్షలు పంపాలనగా అందరికీ అనుమానం వచ్చింది. పోలీసులకు విషయం చేరడంతో నిందితుడిని గాలించి పట్టుకున్నారు. ఈ మోసగాడు ఇదే తరహాలో 20 రోజుల కిందట విశాఖలో ఓ వైద్యురాలిని పెళ్లి చేసుకొని... మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.