హాలీవుడ్ స్టార్‌కున్నజాలి కూడా మీకు లేదు.. సిగ్గుపడండి అంటున్న మనోజ్
నీటి సమస్యతో సతమతమవుతున్న తమిళ ప్రజలకు ట్యాంకర్‌లతో నీళ్లు పంపి తన వంతు మానవత్వాన్ని చాటుకున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్... తాజాగా మరోసారి వార్తల్లోకి వచ్చాడు.
వివరాలలోకి వెళ్తే... చెన్నై ప్రజలు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. తాగడానికి గుక్కెడు నీరులేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి సహాయం చేయండి అంటూ టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఇటీవల ఓ పోస్ట్ చేశారు. ‘తెలుగు ప్రజలు అవసరాల్లో ఉన్నప్పుడు చెన్నై ప్రజలు మనకు ఆహారం, నీరు, వసతి కల్పించారు.
ఇప్పుడు మనం సహాయం చేయాల్సిన సమయం వచ్చింది. దేశంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటైన చెన్నైలో నీటి సమస్య ఏర్పడింది. నా స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి నేను పెరిగిన ప్రాంతానికి నీరు సరఫరా చేసాను. మీరు కూడా మీ వంతు సహాయం చేయండి’ అని కోరుతూ మనోజ్ ఇటీవల ట్వీట్ చేసారు.
అయితే దీనికి నెటిజన్ల నుండి ప్రతికూల కామెంట్‌లే ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో బుధవారం మరో ట్వీట్ చేసిన మనోజ్... చెన్నై వాసుల దుస్థితిపై హాలీవుడ్ స్టార్, పర్యావరణ వేత్త లియోనార్డో డికాప్రియో ఇన్‌స్టాగ్రామ్‌లో విచారం వ్యక్తం చేయడాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... ఆయన పోస్ట్‌ను షేర్ చేశారు.
‘నేను చెన్నైకి సహాయం చేయడాన్ని వ్యతిరేకిస్తూ కామెంట్లు చేసిన వారి కోసం ఈ పోస్ట్. మీ తీరుపై మీరు సిగ్గుపడాలి. మనమంతా భారతీయులం. దానికంటే ముందు మనుషులం. చెన్నై వాసులపై కనీసం ఓ హాలీవుడ్ నటుడికి ఉన్న జాలి కూడా మీకు లేదు. దయచేసి మానవత్వాన్ని చంపొద్దు. అవసరాల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి జాతి, కులం, రాష్ట్రం అని తేడాలు చూడొద్దు’ అని ట్వీట్ చేశారు.