బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (05:16 IST)

ఇలాగైతే పోలవరం గీలవరమే: తేల్చిచెప్పిన ఉన్నతాధికారులు.. కొట్టి పడేసిన బాబు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోరమైన లోటుపాట్లు జరుగుతున్నాయని ఏపీ ఉన్నతాధికారులు చెబుతున్నవన్నీ వాస్తవమేనని తేలిపోతోంది. కనీస మానవ వనరులు కూడా లేని ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ప్రధాన కాంట్రాక్టు నివ్వడం క

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఘోరమైన లోటుపాట్లు జరుగుతున్నాయని ఏపీ ఉన్నతాధికారులు చెబుతున్నవన్నీ వాస్తవమేనని తేలిపోతోంది. కనీస మానవ వనరులు కూడా లేని ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ప్రధాన కాంట్రాక్టు నివ్వడం కొంపముంచుతుందని అధికారులు మొదటినుంచి నెత్తీ నోరూ మొత్తుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుపోవడం ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి వరంగా మిగలగా.. రాష్ట్ర భవిష్యత్తుకు శాపంలా తగులుతోంది. ప్రధాన కంపెనీ ఒక్క పనికూడా చేపట్టకుండా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించడమే కాకుండా పని పూర్తి చేసినంతవరకూ బిల్లులు కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతోందని, ఇలాగైతే గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని అధికారులు చేస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొట్టిపారేయడం ఉన్నతాధికారులను నివ్వెరపర్చింది.

 
అధికారుల పరిశీలనలో పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమీక్ష నివేదిక ఏం చెబుతోంది? 
 
పోలవరం ప్రాజెక్టు పనులు చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కి లేదు.
 ఆ సంస్థకు సాంకేతిక నిపుణులుగానీ, మానవవనరులుగానీ అందుబాటులో లేవు.
ట్రాన్స్‌ట్రాయ్‌ పనులు చేయకుండా సబ్‌ కాంట్రాక్టు సంస్థలకు పనులు అప్పగిస్తోంది.
సబ్ కాంట్రాక్టు సంస్థలు చేసిన పనులకు ట్రాన్స్‌ట్రాయ్‌ బిల్లులు చెల్లించడం లేదు. 
మట్టి పనులు చేస్తోన్న త్రివేణి సంస్థకు రూ.140 కోట్లకుపైగా ట్రాన్స్‌ట్రాయ్‌ చెల్లించలేదు. 
ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం, డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు చేస్తోన్న బావర్, ఎల్‌ అండ్‌ టీ సంస్థలకు ట్రాన్స్‌ట్రాయ్‌ బిల్లులు చెల్లించడం లేదు.
స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు 14.11 లక్షల క్యూబిక్‌ మీటర్లు పూర్తి చేయాల్సి ఉండగా కేవలం 32 వేల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే పూర్తి చేశారు. 
స్పిల్‌ వే మట్టి పనుల్లో 10.55 కోట్ల క్యూబిక్‌ మీటర్లకుగానూ 6.55 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తి చేశారు. 
డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు ఈ ఏడాది ఆగస్టులోగా 667 మీటర్లు పూర్తి చేయవలసి ఉండగా, ఇప్పటివరకూ కేవలం 28 మీటర్లే పూర్తి చేశారు. 
48 గేట్లకుగానూ మూడు గేట్లు మాత్రమే పూర్తయ్యే దశకు చేరుకున్నాయని మరో రెండు గేట్ల పనులు ప్రారంభించారు
 
ఇవీ.. జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సోమవారం నాటి సమీక్షలో సీఎంకు వివరించిన విషయాలు. వాటిని బాబు పరిగణనలోకి తీసుకోలేదు సరికదా.. పనులు సంతృప్తికరంగా సాగుతున్నాయన్నాయని సమర్థించడమే కాకుండా, వాస్తవాలు చూడాలంటూ అధికారులకే అక్షింతలు వేసి వారు అవాక్కయేలా చేశారు.

పనులు చేసే సత్తా లేని ట్రాన్స్‌ట్రాయ్‌కి  సీఎం నిబంధనలు ఉల్లంఘించి మరీ  వెసులుబాట్లు కల్పిస్తుండటంలో ఆంతర్యం తెలిసిందేననీ, కమీషన్ల కోసమే కాంట్రాక్టు సంస్థని, సబ్‌కాంట్రాక్టు సంస్థలను చంద్రబాబు ఇలా రక్షిస్తున్నారని జలవనరుల శాఖలో విమర్శలు ఎప్బటినుంచో వినిపిస్తున్నాయి.