శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 26 జూన్ 2017 (07:01 IST)

యజమానులు మరణించారు... బిడ్డల్లా పెంచిన కుక్కలు బావురుమంటున్నాయి

కన్నవారికి పట్టెడన్నం పెట్టే దయ లేని మనుషులు నేల నలు చెరగులా పుట్టుకొస్తున్న దుర్మార్గపు రోజులివి. విశ్వాసం మనిషి దరిదాపుల్లో లేకుండా ఆమడ దూరం వైదొలుగుతున్న పాడు కాలమిది. పాపం. ఆ కుక్కలకు ఇవేవీ తెలీనట్లుంది. అవి తమ యజమానిని నమ్మాయి. వారు పెట్టిన తిండ

కన్నవారికి పట్టెడన్నం పెట్టే దయ లేని మనుషులు నేల నలు చెరగులా పుట్టుకొస్తున్న దుర్మార్గపు రోజులివి. విశ్వాసం మనిషి దరిదాపుల్లో లేకుండా ఆమడ దూరం వైదొలుగుతున్న పాడు కాలమిది. పాపం. ఆ కుక్కలకు ఇవేవీ తెలీనట్లుంది. అవి తమ యజమానిని నమ్మాయి. వారు పెట్టిన తిండి తిన్నాయి.  అప్పుల బాధ తట్టుకోలేక యజమాని, భార్య ఆత్మహత్య చేసుకుంటే ఇక వారు లేరని, రారని అర్థమై వారు శాశ్వతంగా నిద్రిస్తున్న చోటే తిండి తిప్పలు మాని రోదిస్తూ తిరుగుతున్నాయి. మనిషికి లేని విశ్వాసం కుక్కకు ఎలా వచ్చిందింటే సమాధానం చెప్పే టెక్నాలజీ ఇంకా పుట్టలేదు కాని ఆ కుక్కల వేదన చూస్తున్న మనుషులు కంట తడిపెడుతున్నారు. విశ్వాసం కుక్క రూపంలో పుట్టిందా అంటూ బాధ పడుతున్నారు. 
 
కుక్కను విశ్వాసానికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఇది నిజమే అని అనిపించే సంఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఓ దంపతులు పెంచుకున్న కుక్కలు వారు మరణించిన నాటి నుంచి తిండి తిప్పలు మాని వారిని దహనం చేసిన వద్దే తిరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్‌ గ్రామంలో అప్పుల బాధతో రైతు దంపతులు మోహనాచారి, సరిత ఈనెల 22న ఆత్మహత్య చేసుకున్నారు.
 
అయితే వీరు పొలం పనులు చేసుకుంటూ వారి వ్యవసాయక్షేత్రం వద్దే నివాసం ఉండేవారు. వీరికి పిల్లలు లేకపోవడంతో కుక్కలను పెంచుకున్నారు. ఆ కుక్కలు తమ యజమానులు మరణించిన రోజునుంచి తిండి తిప్పలు మానేసి దహనం చేసిన చోటు నుంచి కదలడం లేదు. ఎవరైనా వెళ్లగొట్టినా అరుస్తూ, మృతదేహాలు కాలిన బూడిద చుట్టూ తిరుగుతున్నాయి. తిండిమాని యజమానులను  దహనం చేసిన చోటే కుక్కలు పడి ఉన్న వైనం చూసిన వారని హృదయాలను ద్రవింప జేస్తున్నాయి. 
 
వీధి కుక్కలను ప్రేమించమని చెపుతున్న అక్కినేని అమలగారూ.. మీరు చాలా మంచివారు. నిజమే.. కానీ ఇలా లేని యజమానుల పట్ల చలించిని విశ్వాసం ప్రదర్శస్తూ చావుకు దగ్గరవుతున్న ఇలాంటి కుక్కలకు పేపర్లో, మీడియాలో చూసయినా కాస్త ఆదుకునే ప్రయత్నం చేస్తారా... మీరే భూత దయకు దశాబ్దాల నిదర్శనంగా నిలుస్తున్నారు కాబట్టి ఇలాంటి కుక్కల బాధను కూడా కాస్త పట్టించుకుంటారా... 
 
ఇలాంటి కుక్కలను దగ్గరికి తీసి పెంచుకోవాలన్నా సొంత ఇళ్లు లేనివాళ్లం. జీవితం చివరివరకూ అద్దె ఇళ్లలోనే ఉంటున్న వాళ్లంమరి. మీరు చేస్తున్న పని చాలా గొప్పదని ఒప్పుకుంటున్నా.. వీటిని కూడా కాస్త పట్టించుకోరూ..