శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (18:37 IST)

'వారసుడు' కోసం వ్యాపారి వక్రబుద్ధి... యువతితో 'లైంగిక' ఒప్పందం

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారికి వారసుడు లేడు. దీంతో ఏదో ఒక రూపంలో వారసుడు అంటే కొడుకును పొందాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఓ అమ్మాయితో సరోగతి విధానం ద్వారా కొడుకును పుట్టించుకోవాలని తొలుత భావించాడు. ఇందుకోసం రూ.4.5 లక్షలకు ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్నాడు. అయితే, ఆ వ్యాపారి బుద్ధి వక్రమార్గంలో పయనించింది. కృత్రిమ పద్ధతిలో కుమారుడు పొందటం ఇష్టంలేకపోవడంతో సహజ పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వాలని భావించాడు. అంతే... ఆ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్వరూప్ రాజ్. వయసు 64 యేళ్లు. హైదరాబాద్ నగరంలో ఓ వ్యాపారి. పంజాగుట్ట పరిధిలోని ఆనంద్ నగర్‌లో నివాసం. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే ఓ కొడుకు కావాలన్న కోరిక అతనిలో బలంగా నాటుకుపోయింది. దాంతో తన ఫ్రెండ్ నూర్‌ను సంప్రదించాడు. కృత్రిమ గర్భధారణ పద్ధతిలో కొడుకును కనవచ్చని, అందుకు ఓ మహిళ అవసరం ఉంటుందని నూర్ చెప్పడంతో స్వరూపరాజ్ సరేనన్నాడు. 
 
నగరానికి చెందిన ఓ 23 ఏళ్ల యువతితో రూ.4.50 లక్షలకు ఒప్పందం కుదిరింది. కృత్రిమ గర్భధారణ ద్వారా ఆమె మగబిడ్డను కని స్వరూపరాజ్‌కు అప్పగించాలన్నది ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా కాన్పు అయ్యేవరకు నెలకు రూ.10 వేలు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఆ యువతి కోరింది. దానికి కూడా స్వరూపరాజ్ అంగీకరించాడు. 
 
అయితే ఆ యువతిని ఇటీవల కలిసిన స్వరూపరాజ్ ఒప్పందాన్ని పక్కనబెట్టి సహజసిద్ధంగా పిల్లవాడ్ని కందాం అంటూ ఆ యువతిని వేధించసాగాడు. ఆ యువతి అందుకు అంగీకరించకపోవడంతో లైంగికదాడికి తెగబడ్డాడు. దీంతో ఆ యువతి నేరుగా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వరూపరాజ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.