మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (12:54 IST)

ఇంజనీరింగ్ పట్టభద్రుడే హైదరాబాద్ డ్రగ్ డాన్... ఇదీ కెల్విన్ 'మత్తు' చరిత్ర

డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో అబ్బురపరిచే విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. విచారణలో బడాబాబుల మూలాలు బయటపడినట్లు వినికిడి. కెల్విన్‌ను రెండురోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ఆద

డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు కెల్విన్ విచారణలో అబ్బురపరిచే విషయాలు వెల్లడైనట్లు తెలిసింది. విచారణలో బడాబాబుల మూలాలు బయటపడినట్లు వినికిడి. కెల్విన్‌ను రెండురోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు ఆదివారం సాయంత్రం వరకు విచారించి కోర్టుకు అప్పగించిన విషయం తెల్సిందే. కెల్విన్ నుంచి సేకరించిన సమాచారంతో లింకులు, పెద్దతలల వివరాలపై ఆరా తీస్తున్నారు. 
 
ఎక్సైజ్ శాఖ విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇంజినీరింగ్ పూర్తిచేసిన కెల్విన్ వ్యక్తిగత కారణాలతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. దీన్ని అధికమించేందుకు గంజాయికి బానిసయ్యాడు. తర్వాత అజ్ఞాత వ్యక్తుల ద్వారా డ్రగ్స్ రూట్స్ తెలుసుకుని, అడ్డదారుల్లో డ్రగ్స్ సంపాదించి సేవించడం మొదలెట్టాడు. 
 
ఇదే మత్తును పలువురు యువతులకు రుచిచూపించాడు. ఈ మత్తుకు బానిసలైన అనేక మంది అతని వశమయ్యారు. వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ద్వారా మరికొంతమందితో లింకులు పెంచుకుంటూ వ్యాపారాన్ని విస్తరింపజేశాడు. ఇలా అంచెలంచెలుగా హైదరాబాద్ డ్రగ్ డాన్‌గా ఎదిగాడు. 
 
గోవాలోని బీచ్‌లలో మాదకద్రవ్యాలను విచ్చలవిడిగా విక్రయిస్తారని, అక్కడి నుంచి రైలుమార్గం లేదా కొరియర్ సంస్థల ద్వారా దిగుమతి చేసుకుంటామని వెల్లడించాడు. కాగా తన కాల్‌డాటా గురించి కెల్విన్ సరైన సమాధానాలు చెప్పలేదు. కెల్విన్ వందలసార్లు ఫోన్ చేసిన వ్యక్తులు ఎవరు? వారితో ఎందుకు మాట్లాడాడు? ఎంతమేర డ్రగ్స్ సరఫరా చేశాడు? అనే ప్రశ్నలకు ఆశించిన మేరకు సమాధానాలు ఇవ్వలేదని తెలిసింది. 
 
అదేసమయంలో కస్టడీలో కెల్విన్ వెల్లడించిన అంశాలపై సిట్ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో పూర్తిస్థాయిలో చర్చించనున్నారు. అలాగే రిమాండ్‌లో ఉన్న మరికొంతమందిని కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. అవసరమైతే కెల్విన్‌ను మరోమారు కస్టడీలోకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు.