శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (08:52 IST)

నిన్నటివరకు ఆ వైద్యుడు అందరివాడు.. ఇపుడు అనాథ శవం... ఎక్కడ?

హైదరాబాద్ నగరంలో ఆయన పేరున్న యునానీ వైద్యుడు. అందరి వైద్యుడుగా పేరు తెచ్చుకున్నాడు. పైగా, తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూర్చడంలో మంచి దిట్ట. అందుకే ఆయన ప్రతి ఒక్కరి మన్ననలు పొందుతూ వచ్చారు. అలాంటి వైద్యుడు కరోనా వైరస్ కారణంగా మరణించాడు. అంతే... ఆయన శవాన్ని చూసేందుకు సైతం ఒక్కరంటే ఒక్కరు రాలేదు. అప్పటివరకు అందరి వైద్యుడుగా పేరుగడించిన ఆయన.. ఇపుడు అనాథ శవమయ్యాడు. 
 
ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది. ఈ 52 యేళ్ల యునానీ వైద్యుడు హైదరాబాద్‌లోని ఏసీ గార్డ్స్ ప్రాంతంలో క్లినిక్‌ను నడుపుతూ వచ్చాడు. ఆయన వద్దకు నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, ఖైరతాబాద్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం ఎంతో మంది వచ్చిపోయేవారు. 
 
అంతటి పేరున్న డాక్టర్, కరోనా కారణంగా మరణిస్తే, అంత్యక్రియలు చేసేందుకు నా అన్నవారు రాలేదు. ఈ విషాదకర ఘటన అగాపురా పరిధిలో జరుగగా, తమ డాక్టర్ మరణించారన్న విషయం తెలుసుకున్న ప్రజలు, కన్నీరు పెట్టడం మినహా మరేమీ చేయలేది పరిస్థితి.
 
ఆయన ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో తొలుత నాంపల్లి ఆసుపత్రికి, ఆపై బంజారాహిల్స్‌లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను కూడా గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోని మిగతా వారందరికీ కరోనా సోకినట్టు తేలింది. అతని భార్య, తల్లి, సోదరి, సోదరుడు... ఇలా ఇంట్లోని అందరూ వ్యాధి బారిన పడ్డారు. 
 
వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన వైద్యుడు మంగళవారం నాడు మరణించగా, కుటుంబీకులు గాంధీలోని ఐసొలేషన్ వార్డులో, బంధువులంతా హోమ్ క్వారంటైన్‌లో ఉండటంతో, వారు అంత్యక్రియలు నిర్వహించే వీలులేకపోయింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బందే ఆయన్ను ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే వైద్యుడికి ఇలా అంత్యక్రియలు జరగడాన్ని ఊహించుకోలేకున్నామని పలువురు విలపించారు.