తాహశీల్దారును ఎందుకు చంపానంటే.... నిందితుడి వాంగ్మూలం
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన తాహశీల్దారు సజీవదహనం కేసులో పోలీసులకు లొంగిపోయిన నిందితుడు వాంగ్మూలం ఇచ్చాడు. పొలం రిజిస్ట్రేషన్ విషయంలో తాహశీల్దారు విజయారెడ్డితో విభేదాలు ఉన్నాయి. పొలం రిజిస్ట్రేషన్ చేయాలని చాలా కాలంగా నిందితుడు తాహశీల్దారు వద్ద మొరపెట్టుకున్నాడు. కానీ, ఆమె కనికరించలేదు. దీంతో ఇక ఓపిక నశించి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు వెల్లడించాడు.
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ కార్యాలయంలోనే ఎమ్మార్వో విజయరెడ్డిపై దుండగుడు పెట్రోలు పోసి నిప్పింటించాడు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘాతుకానికి పాల్పడింది సురేష్ అనే రైతుగా పోలీసులు గుర్తించారు. ఎమ్మార్వోను సజీవదహనం చేసిన తర్వాత నిందితుడు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
పొలం రిజిస్ట్రేషన్ విషయంలో విజయారెడ్డి వేధిస్తున్నారని అందుకే తాను హత్య చేశానని విచారణలో సురేష్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. తహశీల్దార్‌కు నిప్పు పెట్టిన సమయంలో సురేష్‌కి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో అతడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. చొక్కా విప్పేసిన సురేష్.. తలుపులు తీసిన బయటికి పరుగులు తీశాడు. నేరుగా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
తహశీల్దార్ విజయారెడ్డికి లైటర్‌తో నిప్పంటించాడని, ఆ సమయంలో సురేష్‌కూ మంటలు అంటుకున్నాయని పోలీసులు తెలిపారు. కాలిన గాయాలతోనే అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ వరకు వచ్చాడని, పీఎస్ బయట పడిపోయాడని తెలిపారు. తనకు అన్యాయం జరిగిందని సురేష్ చెప్పాడని పోలీసులు వెల్లడించారు. దాదాపు 60 శాతం కాలిన గాయాలతో ఉన్న సురేష్ ను ఆస్పత్రికి తరలించారు.
కాగా, నిందితుడు పూర్తి పేరు కుర్రా సురేష్. గౌరెల్లి గ్రామానికి చెందిన రైతు అని పోలీసులు తెలిపారు. సురేష్‌కి సంబంధించిన 7 ఎకరాల భూమి వివాదంలో ఉందని, దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఈ విషయమై తహశీల్దార్ ను హత్య చేశాడా లేక మరేదైనా కారణమా అన్నది తేలాల్సి ఉందన్నారు. సురేష్ పై హత్యా నేరం ఫైల్ చేస్తున్నామని పోలీసులు చెప్పారు.