శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 25 ఆగస్టు 2019 (13:32 IST)

మరో మొగుడుపై మోజుతో కోసం కన్నబిడ్డను తెగనమ్మిన తల్లి

మొదట కట్టుకున్న భర్త పేదరికం కారణంగా భార్యాబిడ్డను వదిలివేశాడు. కానీ, ఆ తల్లికి మాత్రం మరో మొగుడు కావాల్సివచ్చింది. ఇందుకోసం కన్నబిడ్డ అడ్డుగా ఉన్నాడని భావించింది. అంతే.. మరో ఆలోచన లేకుండా ఆ బిడ్డను రూ.60 వేలకు అమ్మేసింది. పైగా, తన బిడ్డను ఎవరో కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 
 
హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, ఎల్బీనగర్, గుంటి జంగయ్యనగర్ కాలనీలో నివాసముంటున్న డేరంగుల విజయలక్ష్మి (30) రమేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి అఖిల్ అనే బిడ్డ ఉన్నాడు. అయితే, పేదరికంతో భార్యాపిల్లలను పోషించలేని రమేష్.. భార్యను వదిలివేసి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో తన బిడ్డ అఖిల్‌తో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌తో పాటు తదితర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుని జీవించేది. 
 
ఈ క్రమంలో ఆమె ఎల్బీనగర్‌లోని గుంటి జంగయ్యనగర్‌ కాలనీకి చేరింది. అక్కడ జల్సాలకు అలవాటుపడిన విజయలక్ష్మికి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. దీంతో తమ మధ్య అడ్డంకిగా ఉన్న 11 నెలల కొడుకును వదిలించుకోవాలని పథకం వేసింది. పథకంలోభాగంగా ఈనెల 20న సాయంత్రం 5 గంటల సమయంలో కాలనీని నుంచి బయటకు వెళ్తుండగా ఒక్కసారిగా కండ్లు తిరిగి కింద పడిపోయానని.. ఓ మహిళ, వ్యక్తి బైకు (టీవీఎస్ మోటర్ టీఎస్07 ఎఫ్‌జే0203)పై వచ్చి తన కుమారుడిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లినట్లు స్థానికులకు తెలిపింది.
 
సదరు మహిళ ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. బైకు నంబర్ ఆధారంగా స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు బాలుడి కిడ్నాప్ కేసులో కొత్త కోణం బయటపడింది. జల్సాలకు అలవాటు పడటమే కాకుండా మరో పెండ్లి చేసుకోవాలనే ఉద్ధేశ్యంతో ఉన్న విజయలక్ష్మి .. తన కొడుకును వదిలించుకునేందుకు కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 
 
పైగా, తన బిడ్డను రంగారెడ్డి జిల్లా ఫారుఖ్‌నగర్ మండలం, చాతన్‌పల్లి గ్రామం, రాంనగర్‌కు కాలనీకి చెందిన ఓరుగంటి మోష (33)కు రూ.60 వేలకు విక్రయించినట్టు వెల్లడించింది. ఆ తర్వాత పోలీసులు బిడ్డను అమ్మిన తల్లితోపాటు కొన్న ఓరుగంటి మోషను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.