ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్.. రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్‌ను ప్రవేశపెట్టేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ వెల్లడించారు.
ఐబీ ఇండియా ఇన్‌ఛార్జ్ బాలకృష్ణ, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ అమీ పార్కర్, బిజినెస్ డెవలప్‌మెంట్ గ్లోబల్ డైరెక్టర్ బన్నయన్‌లను ప్రవీణ్ ప్రకాష్ కలిశారు. ఈ క్రమంలో 10, 12 తరగతుల విద్యార్థులకు ఐబీ-ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి సర్టిఫికెట్ల జారీ ప్రక్రియపై చర్చించారు.
మనబడి నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా నిర్మించిన డిజిటల్ తరగతి గదులు, విద్యా కానుక అందిస్తున్న ట్యాబ్‌లు అంతర్జాతీయ భాషలను డిజిటల్ విధానంలో బోధించేందుకు దోహదపడతాయని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
విద్యార్థి దశ నుంచే వ్యాపార సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమానికి సంబంధించి ప్రముఖ పారిశ్రామికవేత్త, హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో చర్చలు జరిపినట్లు తెలిపారు.
సబీర్ భాటియా రూపొందించిన ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్‌ను 9 నుండి 12వ తరగతి విద్యార్థులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యాపారవేత్తలుగా ఎదగడానికి అవసరమైన మనస్తత్వం, నైపుణ్యాలు లభిస్తాయని వెల్లడించారు.