పంటల బీమా ప్రీమియం చెల్లింపుల్లో సమూల మార్పులు చేశామని, అందులో భాగంగానే రైతులపై ఏ మాత్రం భారం పడకుండా ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెల్లడించారు. రైతుల నుంచి నామమాత్రంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే వసూలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
పంటల ఈ–క్రాపింగ్ పూర్తి కాగానే ప్రీమియం చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పంటల ఈ–క్రాపింగ్ చేస్తున్నామన్న సీఎం, గ్రామ సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ సహాయకుల సంయుక్త పర్యవేక్షణ పూర్తి కాగానే, ఈ–క్రాపింగ్ నమోదు చేస్తున్నామని వెల్లడించారు. ఆ వెంటనే పంటల ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఇందు కోసం వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టామని సీఎం చెప్పారు.
2018–19 రబీ పంటల బీమా ప్రీమియమ్‌కు సంబంధించి అప్పటి ప్రభుత్వం బకాయి పడిన రూ.122.61 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించింది. దీంతో అప్పటి పంట నష్టానికి సంబంధించి బీమా కంపెనీలు రూ.596.36 కోట్ల క్లెయిమ్స్ విడుదల చేశాయి. ఆ మొత్తంతో రాష్ట్రంలో 5.94 లక్షల రైతులకు లబ్ధి కలుగుతోంది. ఈ మేరకు క్యాంప్ కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కిన సీఎం వైయస్ జగన్, రైతుల ఖాతాల్లో నేరుగా బీమా పరిహారం జమ చేశారు.
ఆ నగదును బ్యాంకుల పాత బాకీల కింద జమ చేసుకోకుండా, అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలో లబ్ధిదారులైన రైతులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందించే సేవలకు సంబంధించిన వైయస్సార్ యాప్‌ను ఆవిష్కరించారు.
నాటి ప్రభుత్వం నిర్లక్ష్యం..
వ్యవసాయ పంటల బీమా విషయంలో రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేదని ప్రస్తావించిన సీఎం వైయస్ జగన్, ఈరోజు తాము ఏం చేస్తున్నామనేది అందరికీ తెలిసేలా కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం 2018–19 రబీ సీజన్‌లో బీమా ప్రీమియమ్ చెల్లించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు.
నిజానికి బీమా ప్రీమియంను కొంత రైతు చెల్లిస్తాడని, మిగిలింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. సాధారణంగా సీజన్ ప్రారంభంలో నెల రోజుల్లోనే బీమా ప్రీమియం చెల్లింపులు జరుగుతాయని, అప్పుడే రైతులకు బీమా పరిహారం సమయానికి అందుతుందని తెలిపారు. ‘కానీ ఇక్కడ పరిస్తితి చూస్తే.. 2018–19కి సంబంధించిన రూ.122.61 కోట్లు గత ప్రభుత్వం చెల్లించలేదు.
రైతులు, కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తమ వంతు ప్రీమియం చెల్లించాయి. కానీ రాష్ట్రం సరైన సమయంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల రైతులకు ఇన్సూరెన్స్ ప్రీమియం రాని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల రైతులకు ఎక్కువ నష్టం జరిగింది’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
అందుకే పరిస్థితి మార్చాలని..:
అందుకే ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని, సకాలంలో రైతులకు సహాయం అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం వెల్లడించారు. బీమా అధికారులతో చర్చలు జరిపి, 2018–19 కి సంబంధించిన బకాయిలు రూ.122.16 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. దీంతో ఈరోజు 5.94 లక్షల రైతులకు మొత్తం రూ.596 కోట్ల పరిహారం అందుతోందని, అది ఈరోజు ఇస్తున్నామని పేర్కొన్నారు.
ప్రీమియమ్ చెల్లింపుల్లో మార్పులు:
మళ్లీ ఇటువంటి పరిస్థితి తిరిగి రాకూడదనే ఉద్దేశంతో, గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లింపుల్లో సమూలమైన మార్పులు చేసిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.
‘రైతులు చెల్లించే బీమా ప్రీమియం వారు చెల్లించకుండా, కేవలం ఒక రూపాయి వారి వంతుగా కడితే చాలు, వారి పంటలకు ఈ క్రాపింగ్ అయిపోయిన వెంటనే బీమా ప్రీమియం చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల పంటలకు నేరుగా ఈక్రాపింగ్ చేస్తున్నాం. సచివాలయాల్లో సర్వేయర్, రెవెన్యూ, వ్యవసాయ అసిస్టెంట్లు సంయుక్తంగా పర్యవేక్షణ జరిపి పంట వేసిన వెంటనే ఈ క్రాపింగ్ నమోదు చేస్తారు.
ఆ వెంటనే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ చేస్తారు’. ‘బీమా ప్రీమియం భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో రైతు కేవలం రూపాయి కడితే చాలని నిర్ణయించాం. మిగిలిన ప్రీమియంను రాష్ట్రం చెల్లిస్తుంది. అందుకోసం ఈ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం’ అని సీఎం వివరించారు.
రైతు భరోసా సొమ్ము ఇవ్వడం నుంచి రైతు భరోసా కేంద్రాలు నెలకొల్పడం, ఈ–క్రాపింగ్, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్, పంట రుణాలు రాని వారికి రుణాలు ఇప్పించే కార్యక్రమం వరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు ఇస్తున్నాం. రైతు వేసే పంటకు సంబంధించి నిపుణులతో సూచనలు, సలహాలు, రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు« ధర కల్పించడం వంటి విషయాల్లో రైతు భరోసా కేంద్రాలు (ఆర్‌బీకే), రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నాయని, ఇందుకోసం సమూల మార్పులను తీసుకువచ్చామని సీఎం తెలిపారు.
‘దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనల వల్ల ఇదంతా చేయగలగుతున్నాను. ఇక రైతులకు మేలు చేసే ఈ కార్యక్రమంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కగానే బీమా పరిహారం సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. పాత అప్పులకు ఈ సొమ్ము జమ చేసుకోకుండా బ్యాంకులతో అధికారులు మాట్లాడాలని ఆదేశించాను. కలెక్టర్లు అందరు బ్యాంకర్లతో మాట్లాడాలి’ అని సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు.
కార్యక్రమంలో వ్యసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, వ్యవసాయ శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి, బీమా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రతి రోజు రైతులు ఆశ్చర్యపోతున్నారు: వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు
ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా గత ప్రభుత్వం బకాయిలు కూడా మీరు ఇస్తున్నారు. ఇవాళ కూడా ప్రీమియమ్ బకాయి చెల్లిస్తున్నారు. చాలా పంటలను బీమా పరిధిలోకి తీసుకువచ్చారు. ఎంత భారమైనా భరిస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్ గణనీయ సేవలందిస్తుందని నమ్మకం.
శనగ రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించారు. సీఎం అయినప్పటి నుంచి రైతులకు కొన్ని వేల కోట్లు జమ చేశారు. ఇప్పుడు వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. రైతు భరోసా కేంద్రాలు కూడా బాగా పని చేస్తున్నాయి. సాయంత్రం కాగానే రైతులు అక్కడ కూర్చుంటున్నారు. గతంలో ఏ సీఎం చేయని విధంగా మీరు చేస్తున్నారు.