బీజేపీతో కలిసి కుట్రలు: నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌పై ఏపీ హోంమంత్రి ఫైర్

home minister sucharitha
ఎం| Last Updated: బుధవారం, 24 జూన్ 2020 (09:06 IST)
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ లు రహస్యంగా భేటీ కావడంపై అనేక అనుమానాలున్నాయని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.

ఈ నెల 13 న ఓ హోటల్ లో ఒకరి తరవాత ఒకరు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒక రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజకీయ నాయకులతో కలవాల్సిన అవసరం ఏముందన్నారు.

స్థానిక సంస్థలు ఎన్నికల విషయంలో కూడా ఉద్దేశపూర్వకంగా నిమ్మగడ్డ ప్రవర్తించాడని గుర్తుచేశారు. ఇప్పడు బీజేపీ నాయకులతో సమావేశమై ఎటువంటి కుట్రలకు సన్నాహాలు చేస్తున్నారో అనే అనుమానం కలుగుతోందన్నారు.

గతంలో కూడా టీడీపీ ఇటువంటి హోటల్ సమావేశాలు, రాజకీయ కుట్రలు చేయడం మనం చూసామన్నారు. బీజేపీ లో పదవి ఉన్నప్పటికీ..టీడీపీ కోసం పనిచేస్తున్న సుజనా, కామినేనిలపై బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవాలన్నారు.

అదేవిధంగా నిమ్మగడ్డ, సుజనా, కామినేని రహస్యంగా హోటల్ లో ఎందుకు సమావేశమయ్యారో చెప్పాలని హోంమంత్రి మేకతోటి సుచరిత డిమాండ్ చేశారు.
దీనిపై మరింత చదవండి :