శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 24 జూన్ 2017 (03:26 IST)

బోర్ వెల్ మృత్యు కుహరాల్లో శలభాల్లా పసిపాపలు.. పరిష్కారమే లేదా?

అనుకోకుండా బోరుబావిలో పడిపోయిన పసిపాపను కాపాండేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న కృషిలో దాదాపు 34 గంటలు గడిచిపోయాయి అయినా అదే ఉత్కంఠ.. బోరుబావిలో పడిపోయిన ఆ పసిపాపను కాపాడేందుకు చేస్తున్న యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి

అనుకోకుండా బోరుబావిలో పడిపోయిన పసిపాపను కాపాండేందుకు విశ్వప్రయత్నం చేస్తున్న కృషిలో దాదాపు 34 గంటలు గడిచిపోయాయి అయినా అదే ఉత్కంఠ.. బోరుబావిలో పడిపోయిన ఆ పసిపాపను కాపాడేందుకు చేస్తున్న యత్నాలు ఇంకా కొలిక్కి రాలేదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చిన్నారిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చనువెళ్లి గ్రామంలో గురువారం సాయంత్రం 18 నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. చిన్నారిని బయటకు తీసేందుకు గురువారం రాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతూనే ఉంది. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం నేతృత్వంలో శుక్రవారం సహాయక చర్యలు చేపట్టారు. ఆటోమేటిక్‌ రెస్క్యూ రోబో, మాన్యువల్‌ రెస్క్యూ రోబోలను ఉపయోగించి చిన్నారిని బయటకు తీసేందుకు యత్నించారు.
 
తరుచుగా చిన్నారులు బోరుబావుల్లో పడుతున్న సంఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు మార్గాలు కనుక్కోవటంలో శాస్త్రపరిజ్ఞానం ఇంకా వెనుకంజలోనే ఉంది. గడిచిన పదేళ్లలో బోరుబావుల్లో పడిన చిన్నారులు సురక్షితంగా బయటపడ్డ ఘటనలు వేళ్లపై లెక్కించవచ్చు. 2006లో హరియాణాలోని కురుక్షేత్రకు సమీపంలో ప్రిన్స్‌ అనే ఐదేళ్ల బాలుడితో పాటు.. 2015 అక్టోబర్‌లో రాజస్థాన్‌లోని దౌసాలో జ్యోతి అనే చిన్నారి మృత్యుంజయులుగా బయటపడ్డారు. 
 
కురుక్షేత్ర సమీపంలోని ఘటనలో ఏకంగా సైన్యం రంగంలోకి దిగింది. సమీపంలో ఎండిన వ్యవసాయ బావి ఉండటంతో.. బావి అట్టడుగు నుంచి బోరుబావిలో చిన్నారిని గుర్తించిన ప్రాంతానికి సొరంగ మార్గం తవ్వి సురక్షితంగా బయటకు తీశారు. పలు పరిశోధనల్లో బోరుబావుల్లో పడిన చిన్నారులను రక్షించేందుకు ఆటోమోటిక్‌ రెస్క్యూ రోబోలను తయారు చేశారు. ప్రయోగాత్మకంగా ఇవి విజయం సాధించినట్లు కనబడినా.. నిజంగా ఆపద సంభవించినప్పుడు విఫలమయ్యాయి.
 
ఘటన జరిగిన ప్రాంతంలోని భూగర్భ పరిస్థితులు అనుకూలించకపోతే రెస్క్యూ చేయటం కష్టమని నిపుణులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో రోబో సాయంతో చిన్నారులను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తే బోరు ఎంత లోతు.. ఎంత వెడల్పు ఉందనే సాంకేతిక అంశాలు కీలకమవుతున్నాయని అంగీకరిస్తున్నారు. మట్టి తడిగా ఉన్నప్పుడు రోబోలు వాడితే మట్టి మరింత కూలిపోయే ప్రమాదం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
 
బోరుబావిలో పడిపోయిన వారిని కాపాడేందుకు చాలాకాలం నుంచి ఉపయోగిస్తూ వస్తున్న పద్ధతి ఆ బావికి సమాంతరంగా మరో గొయ్యి తవ్వడం. కానీ చిన్నారిని కాపాడేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం రెండు కొత్త టెక్నాలజీలను ఉపయోగించి పాపను రక్షించే ప్రయత్నం చేసింది.
 
ఆటోమెటిక్‌ రెస్క్యూ రోబో.. ఈ పరికరాన్ని మిషన్‌తో నియంత్రిస్తూ బోరుబావిలోకి వదిలారు. ఈ పరికరం బోరుబావిలో పడిపోయిన వారిని బిగించుకుని పైకి లాగుతుంది. ఈ పద్ధతిలో పాపను బయటకు లాగేందుకు పలుమార్లు ప్రయత్నం చేసినా సఫలం కాలేదు.
 
మాన్యువల్‌ రెస్క్యూ రోబో.. ఈ పద్ధతిలో రెండు చేతుల మాదిరిగా ఉన్న రోబో పరికరాలను బోరుబావులోకి పంపి బయటకు తీసే యత్నం చేశారు. ఇది కూడా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి ఒక చేయి మాత్రమే పైకి ఉండటంతో ఈ పరికరం పాపను పట్టుకోలేకపోయింది. పలు మార్లు ప్రయత్నించినా జారిపోవడంతో ఈ ప్రయత్నాన్ని విరమించారు. ఈ రెండు పద్ధతులను మహారాష్ట్రలోని బీజాపూర్‌లో ఇలాంటి రెండు మూడు సంఘటనల్లో ఉపయోగించి మంచి ఫలితాలను సాధించినట్లు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ కమాండర్‌ డీఎన్‌ సింగ్‌ తెలిపారు.
 
పాపను రక్షించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాం. రోబోటిక్‌ టెక్నాలజీ, సంప్రదాయ పద్ధతులతో వెలికి తీసేందుకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. బోరుబావికి సమాంతరంగా గొయ్యిని తవ్వుతున్నాం. పాప తొలుత 40 అడుగుల లోతుల్లో చిక్కుకున్నట్లు గుర్తించాం. ఏకకాలంలో మోటారు పంపు, చిన్నారిని పైకి లాగే క్రమంలో మోటారు వచ్చినా.. పాప మరింత లోతుల్లోకి పడిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 70 నుంచి 80 అడుగుల లోతుల్లో పాప ఉన్నట్లు అంచనా వేశాం. శుక్రవారం మధ్యాహ్నాం తర్వాత నుంచి చిన్నారి కదలికలు కనిపించడం లేదు. ప్రస్తుతం 40 ఫీట్ల మేర సమాంతరంగా గొయ్యి తవ్వాం. రాతి నేల కావడం, వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. – జిల్లా కలెక్టర్‌ ఎం.రఘునందన్‌రావు