శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 28 మార్చి 2024 (13:28 IST)

బస్సు యాత్ర తొలి రోజే తుస్సుమన్నదా? వైకాపా నేతల్లో చర్చ? పార్టీ నేతలపై సీఎం జగన్ మండిపాటు!?

bus tour
ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తన సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టారు. తన సొంత జిల్లా కడపలోని ఇడుపులపాయ నుంచి ఆయన ఈ యాత్రను ప్రారంభించారు. అయితే, మేమంతా సిద్ధం అనే పేరుతో ప్రారంభమైన ఈ యాత్రకు తొలిరోజే గట్టి దెబ్బ తగిలింది. సొంత జిల్లాలోనే ప్రజలు ఆదరణ కరువైంది. పొరుగు జిల్లాలల నుంచి బస్సులు పెట్టి తరలించినప్పటికీ ప్రజలు మాత్రం బస్సు యాత్రలో కనిపించలేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యారు. పైగా, ప్రజలు లేకపోవడంతో పార్టీ నేతలతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. 
 
ఈ బస్సు యాత్రలో ఇడుపులపాయ వద్ద నుంచి తొలి రోజు యాత్ర ముగిసేంత వరకు ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది, పోలీసులు హడావుడే తప్ప జనం లేరు. అక్కడి నుంచి జనం పెద్దగా లేకుండానే ప్రొద్దుటూరు వరకు సీఎం బస్సు యాత్ర సాగింది. పెద్దగా స్పందన లేకున్నా బస్సులో కూర్చుని వెళుతూ జగన్ తనదైనశైలిలో చుట్టుపక్కల ఉన్నవారికి, 'లేని వారికి కూడా అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సీఎం సొంత నియోజకవర్గం పులివెందుల పరిధిలోని వేంపల్లె, జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని యర్రగుంట్ల లాంటి కొద్ది కూడళ్లలో డ్రోన్ షాట్స్ కోసం జనాలను పోగు చేశారు. అక్కడ మాత్రం జగన్ బస్సు టాప్‌పైకి ఎక్కి జనానికి అభివాదం చేశారు.
 
ప్రొద్దుటూరు సభకు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల నుంచి జనాన్ని బస్సులు పెట్టి మరీ తరలించారు. వైకాపా నేతలు ఎంత కష్టపడినా, ఆ బస్సుల్లో జనం సగం సగమే సభకు వచ్చారు. సీఎం సభావేదికపైకి సాయంత్రం 6 గంటలకు వచ్చేసరికి ఆ జనంలోనూ ఎక్కువ మంది వెళ్లిపోయారు. 6:30 గంటల సమయంలో జగన్ ప్రసంగం ప్రారంభమయ్యాక సభలో ఉన్న జనం కూడా మెల్లగా తిరుగుపయనమయ్యారు.
 
దాదాపు ఐదేళఅలుగా అధికారంలో ఉండి ఆసరా పథకం ఇవ్వబోమనో, పథకాలను ఆపేస్తామనో డ్వాక్రా మహిళలను బెదిరించి సభలకు తరలించారు. 'ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధికార దుర్వినియోగం సాధ్యపడడం లేదా? మన సలహాదారు, ఐ-ప్యాక్ సరిగా ప్లాన్ చేయలేదా? ఎక్కడ తేడా కొట్టింది? అధికారం లేకపోతే ఎలా ఉంటుందనేది జగన్ తొలి సభలోనే ఆవిష్కృతమైందా అనే చర్చ ఇప్పుడు వైకాపా వర్గాల్లోనే అధికంగా సాగుతుంది. మరోవైపు, ప్రొద్దుటూరులో ముఖ్యమంత్రి జగన్ సభ సాక్షిగా స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వర్గపోరు బయటపడింది. సీఎంకు ఆహ్వానం పలుకుతూ ఎమ్మెల్సీ వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే వర్గంవారు తొలగించడం గమనార్హం.