టీటీడీ భూముల అమ్మకాలపై జగన్ బ్రేకులు, ప్రక్రియ నిలిపివేత
టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియపై తీవ్ర విమర్శలు వ్యక్తమైన నేపథ్యంలో వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గింది. టీటీడీ భూముల అమ్మకాల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.
2016, జనవరి 30న టీటీడీ బోర్డు చేసిన తీర్మానాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత పాలకమండలి నిర్ణయాన్ని నిలిపివేస్తూ జీవో నెంబర్ 888 విడుదల చేశారు.
భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయంపై టీటీడీ పునఃపరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించింది. మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలని సూచించింది.
ఆధ్యాత్మికవేత్తలు, ధర్మప్రచారకులతో సంప్రదింపులు జరపాలని ఉత్తర్వులో ప్రభుత్వం టీటీడీకి సూచించింది. సంప్రదింపుల ప్రక్రియ పూర్తయ్యే వరకూ భూముల వేలం నిలిపివేయాలని నిర్ణయించింది. పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ప్రభుత్వం ఆదేశించింది.