బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 22 మే 2020 (23:15 IST)

నిరుద్యోగం పెరకుండా ఉండేందుకే చర్యలు: జగన్‌

స్థూల, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక (ఎంఎస్‌ఎంఈ) రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెల్లడించారు. అందువల్ల జిల్లాలలో మూడో జేసీకి ఎంఎస్‌ఎంఈల బాధ్యత అప్పగించాలని సీఎం కలెక్టర్లకు నిర్దేశించారు.

జిల్లాలలో పరిశ్రమల అవసరాలు గుర్తించాలని, యువతలో వృత్తి నైపుణ్యం పెంచడం ద్వారా వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపర్చాలని కోరారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 25 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు.

పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అన్నది ప్రభుత్వ లక్ష్యమని సీఎం మరోసారి గుర్తు చేశారు. రూ.1110 కోట్లతో ఎంఎస్‌ఎంఈలకు  రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం, ఆ పరిశ్రమలకు గత టీడీపీ ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రోత్సాహక, రాయితీలతో సహా మొత్తం రూ.905 కోట్లు ఒకేసారి మంజూరు చేసింది.

2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు మొత్తం రూ.828 కోట్ల బకాయి పడింది. 2014–15లో రూ.43 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ. 195 కోట్లు, 2017–18లో రూ. 207 కోట్లు, 2018–19లో రూ.313 కోట్లు టీడీపీ ప్రభుత్వం బకాయి పెట్టింది. దాంతో అప్పటివరకూ మొత్తం బకాయిలు రూ. 828 కోట్లకు చేరాయి. ఆ మొత్తంతో సహా ఈ ఏడాది ఏప్రిల్‌ 30 వరకు ఎంఎస్‌ఎంఈలకు పూర్తి ప్రోత్సాహక నిధులను మంజూరు చేసిన ప్రభుత్వం, అందులో తొలి విడత నిధులు రూ.450 కోట్లు శుక్రవారం విడుదల చేసింది.

క్యాంప్‌ ఆఫీసులో జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం వైయస్‌ జగన్, ఆ తర్వాత కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి నిధులు విడుదల చేశారు. అనంతరం పరిశ్రమల శాఖ ప్రచురించిన సమాచార బ్రోచర్‌ను సీఎం ఆవిష్కరించారు. రాష్ట్రంలో 98 వేల ఎంఎస్‌ఎంఈలు ఉండగా, అవి దాదాపు 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
 
ఎంఎస్‌ఎంఈలను కాపాడుకోవాలి:
రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) దాదాపు 98 వేలు ఉంటే, వాటిలో దాదాపు 10 లక్షల మంది పని చేస్తున్నారని, ప్రైవేటు రంగంలో జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ఈ రంగం అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

వాటిని కాపాడుకోలేకపోతే నిరుద్యోగ సమస్యను అధికమించలేమని, అందువల్ల జిల్లాలలో జేసీ–3కి ఎంఎస్‌ఎంఈల బాధ్యతలు అప్పగించాలని ఆయన కలెక్టర్లను కోరారు. ఈ రంగానికి ప్రభుత్వం తోడు ఉంటే తప్ప అవి మనుగడ కొనసాగించలేవని, అందుకే శ్రద్ధ పెట్టమని కలెక్టర్లను కోరుతున్నానని చెప్పారు.