శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 15 మే 2020 (22:47 IST)

వైయస్సార్‌ రైతు భరోసా –పీఎం కిసాన్‌ పథకం ప్రారంభించిన జగన్‌

లాక్‌డౌన్‌ సమయంలో రైతులను ఆదుకోవడం కోసం రూ.1000 కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రతి విషయంలో రైతులకు మంచి జరగాలని ప్రభుత్వం పరితపిస్తోందని అందుకే చెప్పిన దాని కంటే ముందే, ఇస్తానన్న దాని కన్నా ఎక్కువ సహాయం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఈనెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతాయని తెలిపారు. రైతులకు ఇంకా మంచి జరగాలని, వారికి సేవ చేసే అవకాశం రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
 
సాగు పెట్టుబడి కోసం రైతులు ఏ మాత్రం ఇబ్బంది పడకుండా వారికి నేరుగా ఆర్థిక సహాయం చేసే ‘వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కిన ఆయన, ఒకేసారి లక్షల రైతు కుటుంబాల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేశారు. 49,43,590 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. 
 
వైయస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ పథకంలో ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.13,500 ఆర్థిక సహాయం చేస్తున్నారు. గత నెలలో రూ.2 వేలు తీసుకోని వారికి ఆ మొత్తం కూడా కలిపి ఇప్పుడు ఒకేసారి రూ.7500  చొప్పున మొత్తం రూ.3675 కోట్ల ఇస్తున్నారు.
 
వీడియో ప్రదర్శన కార్యక్రమంలో ముందుగా ప్రజా సంకల్పయాత్రలో విజువల్స్‌తో పాటు, మహానేత వైయస్సార్‌ విజువల్స్‌తో వీడియో ప్రదర్శించారు. వైయస్సార్‌ రైతు భరోసా పథకంపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగాన్ని ఆ వీడియోలో పొందుపర్చారు.

తొలుత ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని అనుకున్నా, ఆ తర్వాత ఆ అన్నీ పెంచి, 5 ఏళ్లు, ఏటా రూ.13,500 చొప్పున ఇవ్వాలని నిర్ణయించామని, దీని వల్ల ప్రతి రైతు కుటుంబానికి 5 ఏళ్లలో రూ.67,500 ఆర్థిక సహాయం అందుతుందని సీఎం పేర్కొన్నారు.
 
రైతులకు ఎంత చేసినా తక్కువే
వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం బాధాకరం అన్న ముఖ్యమంత్రి, కానీ కరోనా వల్ల తప్పడం లేదని పేర్కొన్నారు. బహిరంగసభలో రైతులతో కలిసి ఈ కార్యక్రమం చేయాలని  ఉవ్విళ్లూరానని కానీ తప్పలేదని చెప్పారు. రైతులకు ఎంత చేసినా తక్కువే అని ఈ సందర్భంగా సీఎం స్పష్టం చేశారు.
 
అందుకే ఈ పథకం
రాష్ట్రంలోదాదాపు 62 శాతం వ్యవసాయంపైనే ఆధారపడ్డారని గుర్తు చేసిన ముఖ్యమంత్రి.. రైతు బాగుంటే రైతు కూలీ బాగుంటాడని, వారు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పారు. రాష్ట్రంలో అర హెక్టారు అంటే 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులు 50 శాతం ఉండగా, ఒక హెక్టారు (2.5 ఎకరాలు) పొలం ఉన్న రైతులు 70 శాతం ఉన్నారని తెలిపారు. 
 
ఇటువంటి రైతులకు అప్పులతో సంబంధం లేకుండా, ఏటా సాగు పెట్టుబడి కోసం వారు ఇబ్బంది పడకుండా ఎంతో కొంత సహాయం చేయాలని, రూ.13,500 చొప్పున ఇస్తూ, ఈ పథకానికి నాంది పలికామని వివరించారు. 50 శాతం రైతులు, 70 శాతం రైతులకు (హెక్టారు భూమి ఉన్న వారు) ఇది ఎంతో ఉపయోగపడుతుందని, 1.25 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఈ మొత్తం సాగులో సరిపోతుందని సీఎం వెల్లడించారు.
 
చెప్పిన దాని కన్నా ముందుగా.. ఎక్కువగా..
‘ఎన్నికల ప్రణాళికలో నాలుగేళ్ల పాటు ఏటా రూ,12,500 చొప్పున మొత్తం రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. కానీ మేనిఫెస్టోలో చెప్పిన దాని కన్నా ముందుగా, మెరుగ్గా చేయగలిగాం. నాలుగేళ్లకు బదులు 5 ఏళ్లు, రూ.12,500కు బదులు రూ.13,500 రైతుల చేతిలో పెడుతున్నాం’.

‘గత ఏడాది 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ. 6534 కోట్లు ఇవ్వగా, ఇప్పుడు 49.43 లక్షల రైతు కుటుంబాలకు సహాయం చేస్తున్నాం. గత నెలలో రూ.2 వేలు ఇచ్చాం. కాబట్టి మిగిలిన రూ.5500 ఇస్తున్నాం. కౌలు రైతులు, ఆలయాల భూములు, అటవీ భూములు సాగు చేసుకుంటున్న వారికి కూడా సహాయం చేస్తున్నాం.

గత నెలలో రూ.2 వేలు పొందని వారికి ఇప్పుడు రూ.7500 ఇస్తాం. వచ్చే అక్టోబరులో రూ.4 వేలు, ఆ తర్వాత పంట ఇంటికి వచ్చే సమయంలో సంక్రాంతి పండగ సందర్భంగా మరో రూ.2 వేలు ఇస్తాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
అర్హత ఉన్న ప్రతి రైతుకుప్రతి రైతుకు మేలు జరిగేలా పథకం అమలు చేస్తున్నామని, పార్టీకి ఓటు వేయకపోయినా, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం ద్వారా మేలు జరుగుతుందని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
 
మరో నెల రోజులు అవకాశం గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిటింగ్‌ కోసం గత నెల 24 నుంచి రైతుల పేర్లు ప్రదర్శించామని, ఎవరైనా మిస్‌ అయితే దరఖాస్తు చేసుకోమని కోరామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మూడు వారాల్లో ఎవరైనా దరఖాస్తు చేయకపోతే, తమ పేర్లు నమోదు చేసుకోకపోతే, మరో నెల రోజుల సమయం ఇస్తున్నామని వెల్లడించారు. కాబట్టి అర్హులైన వారు తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.
 
ఎగ్గొట్టాలని కాకుండా..
ఎలా ఎగ్గొట్టాలని కాకుండా ఎలా ఇవ్వాలని మాత్రమే ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందన్న సీఎం వైయస్‌ జగన్, ఇప్పుడు బటన్‌ నొక్కిన వెంటనే రైతుల కుటుంబాల ఖాతాల్లో రూ.5500 చొప్పున జమ అవుతాయని తెలిపారు. గత నెల రూ.2 వేలు పొందని వారికి ఇప్పుడు రూ.7500 జమ అవుతాయని వెల్లడించారు.
 
కాల్‌ సెంటర్‌
రైతులకు ఏ ఇబ్బంది వచ్చినా, వెంటనే 1902 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే స్పందిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ ప్రకటించారు. ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని బ్యాంకులు ఏ రుణ ఖాతాలో జమ చేసుకునే వీలు లేదని స్పష్టం చేశారు.
 
రైతు భరోసా కేంద్రాలు
‘ప్రతి విషయంలో రైతుకు మంచి జరగాలని ఈ ప్రభుత్వం పరితపిస్తోంది, అందులో భాగంగా ఈనెల 30వ తేదీన 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. మొత్తం 11,600 గ్రామ సచివాలయాలు ఉంటే, 10,641 రైతు భరోసా కేంద్రాలు ప్రారంభిస్తున్నాం. ఆ రోజుకు మన ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది’.
 
‘ఆర్‌బికేలలో రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగు మందులు, రసాయనాలు విక్రయిస్తారు. వాటి నాణ్యతలో ప్రభుత్వానిదే గ్యారంటీ. ఆ విధంగా నాణ్యతతో కూడిన విత్తనాలు, రసాయనాలు, పురుగు మందులు రైతులకు దొరుకుతాయి’.
 
‘ఆ ఆర్‌బీకేలలో ఒక కియోస్క్‌ కూడా ఉంటుంది. అక్కడ ఉండే వ్యక్తి రైతులకు పూర్తిగా సలహాలు అందిస్తారు. ఏ పంట వేస్తే బాగుంటుంది, దేశంలో, రాష్ట్రంలో పరిస్థితి వంటివి వివరిస్తారు. అక్కడే ల్యాబ్‌ ఉంటుంది. భూసార నాణ్యతను పరీక్షిస్తారు. గ్రామ, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి’.
 
‘రైతుల పంటలపై ఈక్రాపింగ్‌ ఉంటుంది. రైతులకు అవసరమైన రుణాలు ఇప్పించడంతోపాటు, వారికి బీమా ప్రక్రియను కూడా ఆర్‌బీకేలు చేస్తాయి. చివరకు రైతులకు గిట్టుబాటు ధరల కల్పనలో కూడా ఆర్‌బీకేలు పని చేస్తాయి. వాటిలో ఉండే వ్యవసాయ సహాయకుడు ఈ పనులన్నీ చేస్తాడు, పంటలు, వాటి ధరలకు సంబంధించి బయటి పరిస్థితి విశ్లేషించి రోజూ నివేదిస్తాడు. అవసరమైతే మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం’ అని ముఖ్యమంత్రి వివరించారు.
 
రైతులకు ఇంకా ఏం చేశాం?
గత ఏడాది నుంచి రైతుల కోసం ఎన్నో పనులు చేశామన్న సీఎం వైయస్‌ జగన్, కౌలు రైతులకు మేలు చేయడం కోసం కౌలుదారీచట్టంలో సవరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. వైయస్సార్‌ రైతు బీమాలో ప్రభుత్వమే పూర్తి ప్రీమియమ్‌ చెల్లించిందని, 2012–13కు సంబంధించి బీమా రాకపోతే రూ.112 కోట్లు ఇచ్చామని, శనగ రైతులను ఆదుకోవడం కోసం రూ.300 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
 
ఇంకా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని ప్రస్తావించిన ముఖ్యమంత్రి.. ఆ మొత్తం నుంచే కరోనా సమయంలో మార్చి 24 నుంచి ఇప్పటి వరకు రూ.1000 కోట్లు ఖర్చు చేసి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించగలిగామని వెల్లడించారు. చివరకు పసుపు, పూల రైతులను కూడా ఆదుకున్నామని, పొగాకు రైతులకూ మేలు చేశామని చెప్పారు.

ఆర్‌బీకేల ద్వారా ఇవన్నీ ఇంకా గొప్పగా చేయాలని అందరి ఆశీస్సులు కోరుతున్నానన్న సీఎం, ఈ ఖరీఫ్‌ నాటికి 82 శాతం ఫీడర్ల ద్వారా రైతులకు 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వగలుగుతున్నామని, ఫీడర్ల కోసం రూ.1700 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
 
ప్రతికూల పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్న 434 రైతు కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇచ్చామని తెలిపారు. రైతులకు బోర్డులు.. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో సలహా బోర్డుల ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

మార్కెటింగ్‌ శాఖను ఇంకా బలోపేతం చేస్తూ, వచ్చే ఏడాది నుంచి ప్రతి గ్రామ సచివాలయం వద్ద వైయస్సార్‌ జనతా బజార్ల ఏర్పాటు చేస్తున్నామని. అక్కడ అన్ని వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు జరుగుతాయని వెల్లడించారు. ఆ విధంగా రైతుల ఉత్పత్తులలో కనీసం 30 శాతం స్థానిక మార్కెట్‌ ఉంటుందని వివరించారు.