మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 మే 2020 (18:23 IST)

నివేదికలో తేడా వస్తే మొహమాటం లేకుండా కంపెనీని షిప్ట్ చేస్తాం: సీఎం జగన్

విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో తొమ్మిది మంది మరణించారని,వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. "ఈ దుర్ఘటనలో చనిపోయిన ప్రతి ఒక్కరికీ రూ.1 కోటి ఆర్థిక సహాయం చేస్తాం. కంపెనీ వాళ్లతో ఎంత రాబట్టుకోవాలనేది ప్రభుత్వం చూసుకుంటుంది. కంపెనీతో ఏం మాట్లాడుకోవాలో అది ప్రభుత్వం మాట్లాడుకుంటుంది. కానీ చనిపోయిన ప్రతి ఒక్కరికీ రూ.1 కోటి సహాయం చేస్తాం. ఎవరూ రూపాయి ఖర్చు లేకుండా వైద్యం చేయిస్తామని" ఆయన అన్నారు.
 
ఇద్దరు సీనియర్ అధికారులు, మంత్రులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని ఆయన అన్నారు. గ్రామాలలోని వారికి మంచి భోజన వసతులు కల్పించాలని కూడా అదికారులను ఆదేశించామని ఆయన చెప్పారు. గ్యాస్‌లీకేజీ సంఘటనపై అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. "ఎల్‌జీ కంపెనీవారు హైడ్రో కార్బన్‌ను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం వల్ల పాలిమరైజేషన్‌ జరిగి లీక్‌ అయింది.
 
ఈ దుర్ఘటనపై లోతుగా అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తున్నా. ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, ఇండీస్ట్రీస్‌ సెక్రటరీ, పీసీబీ సెక్రటరీ, విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌లు ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. ఏం జరిగింది..? ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి అనే అంశాలపై అధ్యయనం చేసి రిపోర్టు ఇస్తారు. అధ్యయనం తరువాత కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది నిర్ణయిస్తాం.
 
దుర్ఘటన తెల్లవారుజామున జరిగింది. గ్యాస్‌ లీక్‌ అయినప్పుడు అలారం మోగాలి. ఎందుకు మోగలేదో.. ఇలా ఎందుకు జరిగిందో లోతైన అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. సంఘటన ఎందుకు జరిగింది.. జరగకుండా నిలువరిచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనేదానిపై కూడా అధ్యయనం చేస్తున్నాం.

నివేదిక వచ్చిన తరువాత కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేదానిపై చర్చిస్తాం. దుర్ఘటన జరిగిన వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి వెళ్లారు. అందుకు అభినందనలు. ఉదయం 5 గంటలకే అంబులెన్స్‌లు అందుబాటులోకి తెచ్చారు. పోలీస్‌ కమిషనర్‌ 4.30కే చేరుకున్నారు. 

కలెక్టర్‌ 5.30 గంటలకే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన వెంటనే అధికారులు చాలా బాగా స్పందించారు. అందుబాటులో ఉన్న అంబులెన్స్‌తో 348 మందిని అన్ని ఆసుపత్రుల్లో చేర్పించారు. 
 
ఆసుపత్రుల్లో చేరినప్పుడు స్పృహలో లేని వారు కూడా.. ఇప్పుడు బాగా రికవర్‌ అయ్యారు. వీరికి చక్కటి వైద్యం అందించినందుకు డాక్టర్లకు అభినందనలు. వెంకటాపురం 1, వెంకటాపురం 2, నందమూరి నగర్, ఎస్వీబీసీ కాలనీ, పద్మనాభపురం గ్రామాల్లోని ప్రజలు భయపడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం తోడుగా ఉంటుంది. 
 
ఈ గ్రామాల్లో మెడికల్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తాం.అక్కడ గ్రామాలకు వెళ్లలేని వాళ్లకు వసతి, ఆహార సదుపాయాలు కల్పిస్తాం. ( మంచి భోజనం పెట్టాలని కలెక్టర్‌ వినయ్‌ చంద్‌కు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు) జరిగిన ఘటనపై కమిటీ రిపోర్టు ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం. మరో రెండు రోజుల పాటు చీఫ్‌ సెక్రటరీ ఇక్కడే ఉంటారు.

ఈ రెండు రోజుల పాటు పూర్తిగా ఈ విషయంపైనే చీఫ్‌ సెక్రటరీ పని చేస్తారు. జిల్లా ఇంచార్జి మంత్రి కన్నబాబు కూడా విశాఖలో ఉంటారు. ఆ గ్రామాలకు ఎలాంటి అవసరాలు వచ్చినా మంత్రి కన్నబాబు, బొత్ససత్యనారాయణలు చూసుకుంటారు. ఏ చిన్న సమస్య రాకుండా చూసుకుంటారు. 
 
ఈ దుర్ఘటనలో పాడి సంపద కూడా చనిపోయింది. వాటికి సంబంధించి కూడా నూరు శాతం ఆర్థిక పరిహారం చేస్తాం. ఆవు, గేదెలు కొని వారికి ఇచ్చి.. మరో రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తా. ఆ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ చెబుతున్నా.. చనిపోయిన వారి కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటా, తోడుగా ఉంటా. 
 
చనిపోయిన వారి కుటుంబాల పోషణకు సంబంధించి అదే కంపెనీలో.. ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. కంపెనీని తరలించే విషయంలో కమిటీ రిపోర్టు వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎల్‌జీ మల్టీనేషనల్‌ కంపెనీ.. మంచి ప్రమాణాలను పాటిస్తుంది. ఒకవేళ ఆ కంపెనీని షిఫ్ట్‌ చేయాల్సి వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా షిఫ్ట్‌ చేయిస్తాం."