1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (11:45 IST)

పులివెందులలో జగన్ ప్రజా దర్బార్.. జనాలు ఏమొచ్చార్రా బాబూ?

ఎన్నికల ఫలితాలపై తెలుగు ప్రజలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇక టీడీపీ చీఫ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులతో కలిసి సమావేశం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. 
 
అంతకుముందే తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్న జగన్.. మూడు రోజుల పాటు కడప జిల్లాలోనే ఉంటున్నారు. కానీ ప్రజాదర్బార్‌లో జగన్‌కు ఊహించని స్పందన వచ్చింది. ప్రజా దర్బార్‌కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. స్థానిక పార్టీ నేతలతో కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఈ ప్రజా దర్బార్‌లో పాల్గొన్నారు.
 
భారీ సంఖ్యలో ప్రజలు ప్రజా దర్బార్‌కు వచ్చినా.. జగన్ ప్రతి ఒక్కరిని పలకరించారు. కొందరితో సెల్ఫీ కూడా తీసుకున్నారు. అనంతరం నిర్వహించిన ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ వైసీపీ ఏపీలో అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. అలా అధికారంలోకి వచ్చే తమ పార్టీ అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ వ్యక్తిగతంగా, సామూహిక సమస్యలను ప్రజలు ఆయనకు తెలిపారు. వారి సమస్యల్ని ఓపిగ్గా విన్నారు. 
 
ఇకపోతే.. పులివెందులలో తనకు రాబోయే మెజార్టీతో పాటు రాయలసీమ జిల్లాల్లో వైసీపీ విజయావకాశాలపై జగన్ సమీక్షించినట్లు సమాచారం. రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలపై వైసీపీ భారీ ఆశలు పెట్టుకుంది. కోస్తా జిల్లాలతో పోలిస్తే తమకు ఎక్కువగా పట్టున్న ఈ ఆరు జిల్లాల్లో అత్యధిక సీట్లు వస్తాయని వైకాపా భావిస్తోంది.