శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 23 జులై 2019 (20:47 IST)

జగన్ రియల్ హీరో... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతల ప్రశంస

దేశంలో ఎన్నడూ, ఎక్కడా చూడని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీరిలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించండంతోపాటు.. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రత్యేక బిల్లులు తెచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రియల్ హీరో అని ఆ వర్గాలకు చెందిన ప్రజా ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. మంగళవారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వారు ఘనంగా సన్మానించారు. 
 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న చరిత్రాత్మకమైన ఈ నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ సువర్ణాధ్యాయం అని, అసెంబ్లీలో బిల్లులు ఆమోదించిన ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని వారు కొనియాడారు.
 
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్ళు అవుతోన్న సందర్భంలో.. సమాజంలో అట్టడుగున ఉన్నఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి, శ్రేయస్సు కోసం.. అహర్నిశలూ పరితపిస్తూ, శ్రమిస్తోన్న యువ, నవ నాయకుడు జగన్ మోహన్ రెడ్డి.. అంటూ వారు అభినందనలతో ముంచెత్తారు. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని శాలువాలు, కిరీటంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖా మంత్రి శంకర నారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.