సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 14 డిశెంబరు 2018 (12:53 IST)

రెడ్ అలర్ట్ ప్రకటించుకున్న జగన్ పార్టీ... ఎందుకు?

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ప్రజా సంకల్ప యాత్రలతోటే కూర్చుంటే మొదటికే మోసం వచ్చే ప్రమాదాన్ని పసిగట్టింది. జగన్ నేతృత్వంలో ఇటీవల సమావేశమైన వైసీపీ కీలక నేతలు ఏపీలోని ఓటర్లు, వాళ్ల జాబితా తీరుతెన్నులను పసిగట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. అధికారాన్ని ఉపయోగించి తెలుగుదేశం పార్టీ దొంగ ఓట్ల నమోదు, తమకు వ్యతిరేక ఓట్లన్న వాటిపై వేటువేసే ప్రక్రియను షురూ చేస్తుందని మదనపడ్డ నేతలు ముందస్తు చర్యలకు పూనుకున్నారు. 
 
ఇందులో భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ముందుర కాళ్లకు బంధం వేసే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలో హస్తిన వెళ్లిన వైసీపీ నేతలు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు, నమోదైన నకిలీ ఓటర్లను నిరోధించాలంటూ అభ్యర్థించారు. 
 
ప్రయివేటు ఏజెన్సీల సాయంతో సర్వేల పేరిట టీడీపీ కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లి వైసీపీ సానుభూతిపరుల ఓట్లను మాయంచేసే పనిపెట్టుకున్నారని కమిషనర్‌కు వివరించారు. టీడీపీ కార్యకర్తల పేర్లలో చిన్నిచిన్న అక్షర మార్పులు చేస్తూ ఒకే వ్యక్తికి నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో దొంగ ఓట్లు సృష్టించారని.. ఇలా 34 లక్షల 17 వేల 125 నకిలీ ఓట్లు ఏపీలో ఉన్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. 
 
 
ఓటర్‌ కార్డును ఆధార్‌ కార్డుతో లింక్‌ చేయడం ద్వారా నకిలీ ఓట్లకు కళ్ళెం వేయాలని కోరారు. అందుకోసం ప్రజాప్రాతినిథ్య చట్టానికి సవరణలు తీసుకురావాలని.. లేదంటే ఆర్డినెన్స్‌ తేవాలని సూచించారు. ఈ విషయమై ఎన్నికల సంఘం సకాలంలో స్పందించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అంటున్నారు.


ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, బొత్స సత్యనారాయణ, వరప్రసాద్‌, మిథున్‌ రెడ్డి తదితరులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు. ఇదిలాఉంటే, తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ పాతబస్తీలో భారీ ఎత్తున దొంగఓట్ల నమోదు, పోలింగ్ జరిగాయంటూ వీడియో సాక్ష్యాలతో సహా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.