గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 29 సెప్టెంబరు 2021 (21:55 IST)

అక్టోబర్ 2న 'జగనన్న స్వచ్ఛ సంకల్పం': మంత్రి పెద్దిరెడ్డి

అత్యంత ప్రతిష్టాత్మక౦గా తీసుకున్న జగనన్న స్వచ్ఛ సంకల్పం- క్లాప్ కార్యక్రమాన్ని అక్టోబర్ 2న విజయవాడలో ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి  ప్రారంభిస్తారని, వంద రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా  రాష్ట్ర౦లోని  13 జిల్లాల్లో అమలుపర్చాలని కలెక్టర్లను  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు.

బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పెద్దిరెడ్డి  పాల్గొని 13 జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి ఆశయమైన పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన గ్రామాలే లక్ష్యంగా పనిచేయాలని, కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా మనం- మన పరిశుభ్రత కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, అదే విధంగా స్వచ్ఛ సంకల్పం కార్యక్రమ౦ కూడా విజయవంతం చేయాలని  అయన అన్నారు.  
 
ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించాలని, అవసరమైన అన్ని వనరులను ప్రభుత్వం సమకూరుస్తోందని, ఇంటిలాగే గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు అవగాహన కల్పించి అమలుపరిస్తేనే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతం అవుతాయని అంటూ, జగనన్న స్వచ్ఛసంకల్పంలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ, 100 రోజుల తర్వాత కూడా ప్రజలే స్వచ్చందంగా పరిశుభ్రమైన వాతావరణాన్ని కొనసాగి౦చుకునేలా వారిని ఉత్తేజ పరచాలని తద్వారా  గ్రామాల్లో అహ్లాదకర వాతావరణ౦  ఏర్పడుతుందని మంత్రి అన్నారు. 

నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఎంపిటిసిలు, జెడ్పిటిసి, ఎంపిపిలు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు  ఈ కార్యక్రమ౦లో తప్పనిసరిగా పాల్గొని భాద్యతాయుతంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజా ప్రతినిధులను కోరారు.