సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 జులై 2019 (15:32 IST)

విభ‌జ‌న హామీల ప్రస్తావ‌న ఏది?... మాదాసు గంగాధ‌రం

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. ప్ర‌త్యేక హోదా ప్ర‌స్తావ‌న లేదు, పోల‌వ‌రం ప్రాజెక్టుకి ఎంతిస్తారో తెలియ‌దు, ప్ర‌త్యేక నిధుల ఊసు లేదని తెలిపారు.
 
ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ అంశంలో కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆ బాధ్య‌త ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మీద ఉంద‌న్నారు. శ‌నివారం హైద‌రాబాద్ ప్ర‌శాస‌న్‌న‌గ‌ర్‌లోని జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో కేంద్ర బ‌డ్జెట్‌పై స్పందించారు. 
 
ఈ సంద‌ర్భంగా మాదాసు గంగాధరం మాట్లాడుతూ.. "మ‌న తెలుగింటి కోడ‌లు నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన కేంద్ర బ‌డ్జెట్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. అస‌లు విభ‌జ‌న హామీల ప్ర‌స్తావ‌నే లేదు. మొద‌టి నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం పోరాడింది జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ప్యాకేజీని తిర‌స్క‌రించింది కూడా ఆయ‌నే. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింద‌న్న భావ‌న రాష్ట్ర ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో నివురుగ‌ప్పిన నిప్పులా ఉంది. తెలుగు ప్ర‌జ‌ల్ని అస‌హ‌నానికి గురి చేయ‌వ‌ద్దు. 
 
రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదా ఇస్తామంటూ పార్ల‌మెంటు సాక్షిగా హామీ ఇచ్చిన కేంద్రం క‌నీసం ప్ర‌త్యేక నిధులు కూడా ఇవ్వ‌లేదు. బ‌డ్జెట్ విష‌యానికి వ‌స్తే ఆంధ్ర ప్రదేశ్ లో కేంద్ర విద్యా సంస్థలకు ఇచ్చిన నిధులు ఏవీ లేవు. కడప ఉక్కు, దుగరాజపట్నం పోర్టుల ప్రస్తావన కూడా కేంద్ర ఆర్థికమంత్రి చేయలేదు. జాతీయ ప్రాజెక్ట్ పోలవరం గురించి ఏమీ చెప్పకపోవడం ఎన్నో అనుమానాలు లేవనెత్తుతోంది. 
 
గిరిజన విశ్వవిద్యాలయానికి ఇచ్చింది కేవలం రూ.8 కోట్లు. తెలుగు రాష్ట్రాలకు చెరో రూ.4 కోట్లు వస్తాయి. గత బడ్జెట్ లో కూడా ఇలాగే నిధులు కేటాయించి అవి కూడా సరిగా ఇవ్వలేదు. పెట్రోల్‌, డీజిల్ మీద మ‌రో రూపాయి సెస్ విధించి సామాన్యుడి మీద మ‌రింత భారం మోపారు. ఇప్ప‌టికే ర‌హదారుల నిర్మాణం నెపంతో రూ. 8 సెస్ వ‌సూలు చేస్తున్నారు. గ్రామాల అభివృద్దికి పెద్ద పీట అన్నారు. 
 
గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం నిధుల కేటాయింపులో కోత వేసేశారు. భార‌త దేశ ర‌క్ష‌ణ మా బాధ్య‌త అంటూ డాంబికాలు ప‌లికారు. బ‌డ్జెట్‌లో చూస్తే జాతీయ భ‌ద్ర‌త‌కు విదిల్చింది అర‌కొర నిధులే. ఇప్ప‌టికే దేశంలో ఉత్త‌రాది, ద‌క్షిణాది భావ‌న వెళ్లూనుకుంటోంది. అటువంటి భావ‌న‌కు ఈ బ‌డ్జెట్ మ‌రింత పెంచే విధంగా ఉంది. జాతీయతా భావం క‌లిగిన జ‌న‌సేన పార్టీ భార‌త‌దేశ అభివృద్దితోపాటు తెలుగు రాష్ట్రాల అభివృద్దిని కూడా కాంక్షిస్తోంది. 
 
దేశ అభివృద్దికి దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌లు అవ‌స‌ర‌మే కానీ, అది సామాన్య మ‌ధ్య త‌ర‌గ‌తి ప‌ట్ల బాధ్య‌త‌తో కూడిన‌దిగా ఉండాల‌న్న‌ది జ‌న‌సేన పార్టీ అభిప్రాయం. న‌వ‌భార‌త నిర్మాణం అని చెబుతూ వ‌చ్చారు. పీయూష్ గోయ‌ల్ ప్ర‌వేశ‌పెట్టిన మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్‌లో వేత‌న జీవుల‌కు కొన్ని రాయితీలు ఇచ్చారు. ఈసారి అవి ఎక్క‌డా క‌న‌బ‌డ‌లేదు. పైగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌తో మ‌రింత న‌డ్డి విరిచారు. 
 
కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌యివేటుపై అతి ప్రేమ చూపింది. బ‌డ్జెట్ అంటే పాల‌సీ మేకింగ్ కాదు. వ‌చ్చిన ఆదాయాన్ని ఎలా ఖ‌ర్చు చేయాలి, అభివృద్దికి సంబంధించిన కేటాయింపులు ఏంటి అనేది చెప్పాలి. యువ‌త‌, మ‌హిళ‌ల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం మిన‌హా ఈ బ‌డ్జెట్‌లో సంతృప్తిక‌ర అంశాలు ఏవీ లేవు" అని అన్నారు.