శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By శ్రీ
Last Modified: శనివారం, 6 జులై 2019 (13:04 IST)

తానా సభలో పవన్ కళ్యాణ్... ఖుషీ నుంచి గబ్బర్ సింగ్ వరకూ ఆగానంటూ...

వాషింగ్టన్‌ డీసీలోని తానా మహాసభల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పవన్ ప్రసంగం ఆద్యంతం సభికులను ఆకట్టుకుంది. తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాల్లో జనసేన ఓటమి చెందిన నేపథ్యంలో పవన్ ప్రసంగం ఎలా ఉండబోతుందా అని ఆసక్తి కనబరిచారు. సినీ జీవితాన్ని రాజకీయాలకు మిళితం చేస్తూ పవన్ మాట్లాడిన తీరు సభికులను ఆకట్టుకుంది. 
 
ఖుషి సినిమా హిట్ తరువాత మరో హిట్ అందుకోవడానికి సుమారు 12 సంవత్సరాలు పట్టిందని గబ్బర్ సింగ్ సినిమా వరకు ఓపికగా  వెయిట్ చేయాల్సి వచ్చిందన్నారు. రాజకీయాలు, సినిమాలు ఎందులో రాణించాలన్నా ఓపిక చాలా అవసరమని, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం అన్నారు. చాలా ఆలోచించిన తర్వాతే జనసేన పార్టీ పెట్టానని, సరికొత్త తరానికి యువతలో ఉన్న ఆవేదనను తెలియజెప్పప్పడానికే జనసేన పెట్టానన్నారు. 
 
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమిని నేను అర్థం చేసుకుని బయటకు రావడానికి 15 నిమిషాలు మాత్రమే పట్టిందన్నారు. బాల్యం నుంచి ప్రతీ ఓటమి నన్ను విజయాల వైపునకు దగ్గర చేసిందన్నారు. జనసేన పార్టీ ఓటమికి పలు కారణాలు ఉండొచ్చు.. కానీ ఆ ఓటమికి నేను ఎందుకు భయపడటం లేదంటే.. అవినీతి, కుంభకోణాలు చేసి రాజకీయాల్లోకి రాలేదు. విలువల కోసం వచ్చా. అది నాకు ఓటమి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానన్నారు. 
 
కులం, మతం, ప్రాంతం ఇలా అందిరనీ కలిపే రాజకీయాలు చేయడానికి వచ్చానని త్వరలో అది నేరవేరుతుందన్న ఆశ నాకు కచ్చితంగా ఉందని ముగించారు పవన్ కళ్యాణ్. పవన్ ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.