గ్లాసు పగిలినా.. తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే...
సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఘోర పరాజయం ఎదురైనప్పటికీ.. తాను మాత్రం తుదిశ్వాస వరకు రాజకీయాల్లోనే ఉంటానని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ సునామీకి గాజుగ్లాసు ముక్కలైంది. ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ పార్టీని ఓటర్లు నేలకేసి కొట్టారు. జనసేన అధినేత తాను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. వైసీపీ ఓట్లను చీల్చడమే ప్రధాన ధ్యేయంగా టికెట్లు కేటాయించినప్పటికీ.. ఎక్కడా పవన్ ప్రభావం కనపడలేదు.
నిజానికి పవన్ అన్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికల్లో తెలంగాణలో 2, ఏపీలో 16 స్థానాల్లో గెలిచి కొంత ఓటు బ్యాంకును నిలబెట్టుకుంది. పార్టీ అధినేత చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనంచేశారు.
కానీ మార్పు కోసం.. ప్రశ్నిస్తానంటూ వచ్చి.. సభలు పెట్టి, రోడ్ల వెంట తింటూ తిరిగిన పవన్ కల్యాణ్ ఈ ఎన్నికల్లో సోదిలోకి లేకుండా పోయారు. తన అస్తిత్వాన్ని కూడా నిలబెట్టుకోలేక పోయారు. ఫలితంగా ఆనయ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు.
ఈ ఫలితాలపై ఆయన స్పందించారు. తాను సుదీర్ఘకాలం మార్పు కోసం జనసేన పార్టీ పెట్టానన్నారు. తాము ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నిలబడ్డామని చెప్పిన పవన్.. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. భారీ మెజార్టీ సాధించి.. సీఎం కాబోతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. రెండోసారి ప్రధాని అవుతున్న నరేంద్ర మోడీకి కూడా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు చెప్పారు.
ఇక, కేంద్రంలో, రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన పార్టీలు ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉంటారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. జనసేన పార్టీ ద్వారా డబ్బులు, సారా పంచకుండా నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ ద్వారా కొత్తవారికి అవకాశం కల్పించామని గుర్తుచేశారు. తాను రెండు స్థానాల్లో గెలవకపోయినా తన తుది శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటూ పోరాడతానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.