పాపం... పవన్ కళ్యాణ్ భవితవ్యం ఏంటి?
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ ఓటర్లు తేరుకోలేని షాకిచ్చారు. శాసనసభ ఎన్నికల్లో సరికొత్త మార్పు తీసుకొస్తామని చెప్పి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన పార్టీ.. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో కనీసం ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది.
చివరకు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేయగా, రెండు స్థానాల్లోనూ ఆయన ఓటమిపాలయ్యారు. విశాఖ జిల్లాలోని గాజువాక, వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా ఆ రెండు స్థానాల్లో చిత్తుగా ఓడిపోయారు.
భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ చేతిలో 3,938 ఓట్ల తేడాతో పవన్ పరాజయం పొందారు. మరోవైపు విశాఖ జిల్లా గాజువాకలో కూడా ఆయన ఓటమి చెందారు.
అయితే, రాష్ట్రం మొత్తం మీద ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో మాత్రం జనసేన అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అక్కడి స్థానంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ రౌండ్ రౌండ్‌కి ఫలితం తారుమారవుతుండటంతో ఈ స్థానం నుంచి ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.