గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 17 నవంబరు 2021 (10:02 IST)

న‌రసాపురంలో పవన్ కల్యాణ్ బహిరంగ సభకు ఏర్పాట్లు

బీజేపీ కేంద్ర నాయ‌కుడు, హోం మంత్రి అమిత్ షా ఇచ్చిన బూస్ట‌ప్ తో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ ఏపీలో మ‌రోసారి రెచ్చిపోనున్నారు. మొన్న తిరుప‌తికి వ‌చ్చిన అమిత్ షా, ప‌వ‌న్ కల్యాణ్ ఏపీలో ప్ర‌తిప‌క్షంగా పోషిస్తున్న పాత్ర‌పై పాజిటివ్ గా స్పందించ‌డం, ర‌హ‌దారుల మ‌ర‌మ్మ‌తుకు శ్ర‌మ‌దానాలు చేయ‌డంపై గొప్ప‌గా అభివ‌ర్ణించ‌డంతో జ‌న‌సేన‌లో కొత్త ఊపు వ‌చ్చిన‌ట్లుంది. ఇపుడు తాజాగా న‌ర‌సాపురంలో బ‌హిరంగ స‌భ‌కు జ‌న‌సేన ప‌వ‌న్ క‌ల్యాణ్ సిద్ధం అవుతున్నారు.
 
 
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఈ నెల 21న జనసేన పార్టీ జిల్లా నాయకులు, జన సైనికులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కల్యాణ్  పాల్గొని ప్రసంగిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకులు, శ్రేణులు పవన్ కల్యాణ్  పర్యటన, కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్నారు. 21వ తేదీ మధ్యాహ్నం 3గం.కు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్స్ లో సభ మొదలవుతుంది. ఆ రోజే ప్రపంచ మత్స్య దినోత్సవం. 
 
 
పవన్ కల్యాణ్ పలు వేదికలపై మత్స్యకారుల అభివృద్ధి గురించి కాంక్షించారు. పోరాట యాత్రకు గంగ పూజ చేసి శ్రీకారం చుట్టింది మత్స్యకారుల సమక్షంలో శ్రీకాకుళం జిల్లా కపాసుకుర్ది తీరంలోనే. నరసాపురంలోని బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లావ్యాప్తంగా నెలకొన్న పలు కీలక సమస్యలను జిల్లా నాయకులు ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్  ఆ సమస్యలను సైతం ప్రస్తావిస్తారు.