గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (11:37 IST)

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుభాషణ్ రెడ్డి మృతి

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి మృతి చెందారు. ఈయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చికిత్స పొందుతూ వచ్చారు. అయితే, ఆరోగ్యం విషమించి మృతి చెందారని వైద్య వర్గాలు వెల్లడించాయి. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఇద్దరు తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, న్యాయవాదులుగా రాణిస్తుండగా, మరొకరు ఇంజనీర్‌గా ఉన్నారు. 
 
బి.సుభాషణ్‌ రెడ్డి భౌతికకాయాన్ని అవంతినగర్‌‌లో ఉన్న ఆయన నివాసానికి తరలించగా, పలువురు ప్రముఖులు నివాళులు అర్పించి, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. బుధవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు. 
 
కాగా, సుభాషణ్ రెడ్డి మరణం పట్ల ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కె.చంద్రశేఖర్ రావు సంతాపం తెలిపారు. దేశానికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్న సీఎం కేసీఆర్... ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార లాంఛనాలతో జస్టిస్ సుభాషణ్‌ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. 
 
మరోవైపు బి.సుభాషణ్‌ రెడ్డి మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం ప్రకటించారు. బి.సుభాషణ్ రెడ్డి మృతి న్యాయరంగానికి తీరనిలోటని ఆయన అన్నారు. మద్రాసు, కేరళ హైకోర్టుల్లో చీఫ్ జస్టిస్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త ఛైర్మన్‌గా బి.సుభాషణ్ రెడ్డి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు తొలి ఛైర్మన్‌గా జస్టిస్ బి.సుభాషణ్ రెడ్డి చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు.