పెద్ద కొడుకు రాక్షసత్వం... విడాకులు ఇప్పించలేదనీ తల్లిని.. తోబుట్టువులను...
కట్టుకున్న భార్యతో విడాకులు ఇప్పించలేదన్న అక్కసుతో కనిపెంచిన తల్లిని, తోడబుట్టిన తమ్ముడిని, కాన్పుకోసం పుట్టింటికి వచ్చిన చెల్లిని.. ఆ ఇంటి పెద్దకొడుకే హతమార్చాడు. నిద్రిస్తున్న వారిపై రాక్షసంగా విరుచుకుపడి.. కుటుంబసభ్యుల నెత్తురు కళ్ల చూశాడు. ఉన్మాదంతో ఊగిపోతూ రోకలిబండతో పదే పదే కొట్టి హతమార్చాడు. భార్యతో విడాకులు ఇప్పించనందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలిసింది.
ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్‌వీధిలో నివాసముంటున్న ఉప్పలూరు చాంద్‌బాషా, గుల్జార్‌బేగంకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్దకుమారుడు కరీముల్లాకు(30) నాలుగేళ్ల క్రితం అదే వీధికి చెందిన షాహిన్‌తో వివాహం జరిపించారు. అతను వేరుగా కాపురం ఉంటున్నాడు. వీరికి ఒక కుమార్తె ఉంది.
రెండో కుమారుడు మహబూబ్‌బాషాకు ఏడాది క్రితం వివాహం చేయగా, అతను వీరి ఇంటి మేడపైన విడిగా కాపురం ఉంటున్నాడు. కుమార్తె కరీమున్(27)కు ఐదేళ్ల క్రితం స్థానిక భగత్‌సింగ్ కాలనీకి చెందిన రహిముల్లాలో పెళ్లి చేశారు. ప్రస్తుతం కరీమున్ ఐదు నెలల గర్భవతి. కాన్పుకోసం పుట్టింటికి వచ్చి ఉంటోంది. చాంద్‌బాషా మెకానిక్‌గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు మహమ్మద్‌రఫీ(25) తండ్రికి ఈ పనిలో తోడ్పడుతున్నాడు. మిగిలిన ఇద్దరు కుమారులు బీరువాల పనికి వెళ్తున్నారు.
ఇదిలావుండగా, తన భార్య ప్రవర్తన సరిగా లేదనే అనుమానంతో విడాకులు ఇప్పించాలంటూ కరీముల్లా తల్లిదండ్రులతో తరచూ గొడవపడేవాడు. ఇందుకు తల్లిదండ్రులు అంగీకరించకపోగా, సక్రమంగా భార్యాబిడ్డతో కాపురం చేసుకోవాలంటూ హితవు పలుకుతూ వచ్చారు. ఈ మాటలు నచ్చని కరీముల్లా, 'విడాకుల విషయంలో సాయం చేయరా? నేను సుఖంగా లేనప్పుడు మిమ్మల్ని బతకనివ్వను?' అని తల్లిదండ్రులను బెదిరిస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో ఆదివారం రాత్రి పదిగంటల వరకూ అమ్మానాన్నతో గొడవపడ్డాడు. చివరకు పెద్దలతో పంచాయితీ చేయిస్తామని అమ్మానాన్న చెప్పడంతో అతను శాంతించాడు. తన ఇంటికి పోతున్న కొడుకును తండ్రి ఆపాడు. ఇక్కడే పడుకుని ఉదయం వెళ్లు అని చెప్పడంతో రాత్రికి కరీముల్లా అక్కడే నిద్రించాడు. సోమవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో రోజుమాదిరిగానే చాంద్‌బాషా మెకానిక్ పనికి వెళ్లాడు.
తండ్రి అటు వెళ్లగానే... గదిలో నిద్రిస్తున్న తల్లి గుల్జార్‌బేగం, చెల్లి కరీమున్, తమ్ముడు మహమ్మద్ రఫీ తలలపై కరీముల్లా రోకలిబండతో కొట్టాడు. తీవ్రంగా గాయపడిన వారు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే కరీముల్లా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. విషయం తెలుసుకున్న చాంద్‌బాషా ఇంటికి తిరిగొచ్చి, రక్తపుమడుగులో విగతజీవులుగా పడిఉన్న భార్య, కొడుకు, కూతురులను చూసి భోరున విలిపించాడు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.