బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (15:33 IST)

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కకు పెట్టిన మెసేజ్ ఆధారంగా గుర్తింపు!! తేజస్వి ఆచూకీ తెలిసిందిలా...

vijayawada police
కొన్నినెలల క్రితం అదృశ్యమైన తేజశ్విని అనే యువతి ఆచూకీని కాకినాడ పోలీసులు గుర్తించారు. తన ప్రియుడి మొబైల్ ఫోను నుంచి అక్క ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు ఆ యువతి పెట్టిన ఓ మెసేజ్ ఆ యువతి ఆచూకిని పోలీసులు కనిపెట్టేలా చేసింది. ఈ వివరాలను పరిశీలిస్తే, భీమవరం పట్టణానికి చెందిన ప్రభాకర్రావు, శివకుమారి దంపతులకు ఇద్దరు సంతానం. చిన్నమ్మాయి తేజస్విని విజయవాడలో తమ పెద్దమ్మ ఇంట్లో ఉంటూ మాచవరంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతోంది. అదే కళాశాల సీనియర్ విద్యార్థి, విజయవాడ శివారు నిడమానూరుకు చెందిన అంజాద్ అలియాస్ షన్ను ప్రేమ పేరుతో తేజస్వినిని లోబరుచుకున్నాడు. గతేడాది అక్టోబర్ 28న రాత్రి వీరిద్దరూ హైదరాబాద్ వెళ్లారు. 
 
అక్కడ పలు ప్రాంతాల్లో తిరిగి డబ్బుల్లేక ఫోన్లు, నగలు అమ్మేశారు. తర్వాత కేరళ, ముంబై, ఢిల్లీలో తిరుగుతూ చివరకు జమ్మూకాశ్మీర్‌కు చేరారు. అక్కడ హోటల్లో అంజాద్ పనికి కుదిరాడు. ఇతరులతో మాట్లాడేందుకు తేజస్వినికి ఫోన్ ఇచ్చేవాడు కాదు. ఓ రోజు అంజాద్ లేని సమయంలో అతని ఫోన్ నుంచే తేజస్విని తన అక్కకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టింది. ఈ చిన్న ఆధారం ద్వారా వివరాలు రాబట్టిన పోలీసులు.. వారు జమ్మూలో ఉన్నట్లు గుర్తించారు. చిరునామాను అక్కడి పోలీసులకు పంపించారు. వారు పోలీసు బృందాన్ని ఆ ప్రాంతానికి పంపించి, ఇద్దరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకొచ్చారు. వీరిని బుధవారం మధ్యాహ్నానికి విమానంలో విజయవాడకు తీసుకురానున్నారు. 
 
కాగా, తన కుమార్తె ఆచూకీ లభించిన తర్వాత తేజస్విని తల్లి శివకుమారి విజయవాడ పోలీసు కార్యాలయంలో సీపీ రామకృష్ణను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్.. పవన్ కల్యాణ్ ఫోనులో మాట్లాడారు. కేసు ఛేదించిన తీరును వివరించారు. 'కిడ్నాప్ చేశారా?' అని సీపీని పవన్ ప్రశ్నించగా.. కాదని, వారు ఇక్కడికి వచ్చాక మరిన్ని వివరాలు రాబడతామన్నారు. యువతిని సురక్షితంగా తీసుకువచ్చేందుకు కృషి చేసినందుకు సీపీ రామకృష్ణను పవన్ అభినందించారు.