బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 3 జులై 2024 (10:40 IST)

మిస్సింగ్ అమ్మాయిలను గుర్తించేందుకు ప్రత్యేక యంత్రాంగం : డిప్యూటీ సీఎం పవన్

pawan kalyan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అయిన అమ్మాయిలను గుర్తించేందుకు ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసే దిశగా దృష్టిసారిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిల ఆచూకీ లేదని, వారు ఎక్కడ ఉన్నారన్నది తెలుసుకోవాలని స్పష్టంచేశారు. ఓ బాలిక జమ్మూలో ఉన్నట్టు తెలిసిందని, 9 నెలల కిందట లవ్ ట్రాప్‌తో ఆ అమ్మాయిని అపహరించినట్టు తెలిసిందని వివరించారు. 
 
బాలిక తల్లి తనను కలిసి భోరున విలపించిందని, తాను మాచవరం సీఐకి ఈ విషయం తెలియజేస్తే... వారు వెంటనే స్పందించి అద్భుతమైన రీతిలో పనితీరు కనబరిచారని పవన్ కల్యాణ్ కొనియాడారు. కొద్ది సమయంలోనే బాలిక ఆచూకీ తెలుసుకున్నారని వెల్లడించారు. ఇదే రీతిలో మిగతా కేసులను కూడా తీవ్రంగా పరిగణించి అధికారులు చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ నిర్దేశించారు. ఈ వ్యవహారంలో ఎక్కడో ఒక చోట కదలిక మొదలైతే తప్ప ఇది తీవ్రరూపం దాల్చదని అన్నారు. 
 
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓ అమ్మాయి అదృశ్యమై 24 గంటలు గడిస్తే, ఆ అమ్మాయి దొరకడం చాలా కష్టమని, ఆ అమ్మాయి సంగతి ఇక మర్చిపోవడమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఇక, 48 గంటలు గడిస్తే ఆ అమ్మాయిని ఎటు తీసుకెళతారో తెలియదు. బెంగళూరు తీసుకెళతారో, ఇంకెక్కడికి తీసుకెళతారో తెలియదు. ఇలాంటి విషయాల్లో పోలీసులు కూడా ఒక్కోసారి నిస్సహాయంగా మారిపోతుంటారని వివరించారు.
 
అయితే, ఏపీ పోలీసులను మాత్రం ఈ విషయంలో అభినందించాలని, ఓ అమ్మాయి అదృశ్యమైన 9 నెలల తర్వాత కూడా ఆచూకీ తెలుసుకోగలిగారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. హేట్సాఫ్ టు ఏపీ పోలీస్ అని వ్యాఖ్యానించారు. ఇంతమంది ఆడపిల్లలు రాష్ట్రంలో అదృశ్యమైపోతే దీనిపై ఎందుకు స్పెషల్ కమిటీ ఏర్పాటు చేయకూడదు అనే అంశాన్ని రాష్ట్ర క్యాబినెట్ దృష్టికి తీసుకెళతానని వెల్లడించారు. పోలీసు అధికారులతో మాట్లాడి దీనిపై ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై ఆలోచిస్తామని చెప్పారు.