మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 30 జూన్ 2024 (12:57 IST)

ఏదిపడితే అది మాట్లాడకుండా నా నోటికి చంద్రబాబు ప్లాస్టర్ వేశారు : అయ్యన్నపాత్రుడు

ayyanna patrudu
ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీహెచ్.అయ్యన్నపాత్రుడు ఎంపికయ్యారు. స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి విశాఖకు వెళ్లారు. అక్కడ నుంచి నర్సీపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడూతూ, ఇంతకుముందులా తాను ఏదిపడితే అది మాట్లాడలేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన నోటికి తాళం వేశారంటూ చమత్కరించారు. 
 
40 సంవత్సరాల క్రితం స్వర్గీయ ఎన్టీఆర్ తనకు మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు తనకు రాష్ట్రంలోనే అత్యున్నతమైన స్పీకర్ పదవి ఇచ్చి గౌరవించారన్నారు. ప్రస్తుతం శాసనసభకు ఎన్నికైన వారిలో 85 మంది కొత్తవారేనని, వారికి సభా మర్యాద, సంప్రదాయాలతోపాటు నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
ప్రతి ఒక్కరికీ సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తానని, అవసరం అనుకుంటే సమావేశాలను మరో రెండుమూడు రోజులు పొడిగిస్తామని వివరించారు. అయ్యన్నపాత్రుడుకు అంతకుముందు విశాఖ విమానాశ్రయంలో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. ఆ తర్వాత అనకాపల్లిలో ఎంపీ సీఎం రమేశ్, కూటమి ఎమ్మెల్యేలు, నగరానికి చెందిన పలువురు వ్యాపారులు అయ్యన్నను కలిసి అభినందనలు తెలిపారు. నర్సీపట్టణంలో ఆయనకు పౌరసన్మానం జరిగింది.