శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , గురువారం, 9 మార్చి 2017 (04:06 IST)

సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో కోడెల తర్వాతే ఎవరైనా.. నోటి దురద మరి..

మనకాలపు రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తర్వాతే ఇంకెవరి నయినా చెప్పాలని జనం చెప్పుకుంటున్నారు

మనకాలపు రాజకీయాల్లో సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తర్వాతే ఇంకెవరి నయినా చెప్పాలని జనం చెప్పుకుంటున్నారు. తాను బోల్డ్ అని దేనికీ భయపడనని, దేన్ని చెప్పాలన్నా వెనకా ముందూ చూసుకోవడం తన తత్వం కాదని  సాహస ప్రదర్శనలు చేసేవారు ఏదో ఒకరోజు బోల్తా పడక తప్పదని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. కానీ కోడెల గారి విషయం చూస్తే ఏదో ఒక రోజు. ఆయన నోరు తెరిచిన ప్రతిసారీ తనకే నష్టం జరుగుతుండటం చూసిన వారికి వింతగొల్పుతోంది. తన పోస్టులో తానే గోల్ వేసుకోవడమే కదా సెల్ఫ్ గోల్ అంటే.. అంతా ఆ నోటి మహిమే అంటున్నారు జనాలు. ఏపీకి స్పీకరే అయినా గతంలో నోటి తీతకొద్దీ చెప్పిన మాట పుణ్యమా అని కోడెల ఈ నెల 20న తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ కోర్టు బోను ఎక్కాల్సి వస్తోంది.
 
అనుకోకుండా అన్నారో, అసలు నిజమే చెప్పేశారో.. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, 2014 ఎన్నికల్లో గెలవడానికి 11 కోట్ల 50 లక్షలు ఖర్చయ్యిందంటూ ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆయన్ని వివాదాల్లోకి నెట్టేశాయి. 11 లక్షలు కాదు, ఏకంగా 11 కోట్లు.. అదే ఈ వివాదానికి కారణం. ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమే అని నిరూపితమైతే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందాయన. ఎందుకంటే, ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు విషయమై ఖచ్చితమైన నిబంధనలున్నాయి మరి. 
 
ఎన్నికల్లో గెలిచినోడూ ఏడుస్తాడు.. ఓడినోడూ ఏడుస్తాడు.. ఓడినోడు కౌంటింగ్‌ కేంద్రం వద్దే ఏడిస్తే, గెలిచినోడు ఇంటికెళ్ళి ఏడుస్తాడని ఓ వాదన వుంది. ఎందుకు ఏడుస్తారంటే, ఎన్నికల్లో పెరిగిపోయిన ఖర్చు అలాంటిది. ఏం చేసినా, ఆ ఖర్చుల్ని తిరిగి రాబట్టుకోవడం కష్టమన్నది ఆ వాదన తాలూకు సారాంశం. అఫ్‌కోర్స్‌, ఇంత ఖర్చు చేస్తున్నాం గనుక, ఇంత రాబట్టొచ్చన్న లెక్కలు రాజకీయ నాయకులకు వుంటాయనుకోండి.. అది వేరే విషయం. 
 
అసలు విషయానికొస్తే, కోడెల శివప్రసాద్‌పై కేసు నమోదయ్యింది. కేసు విచారణకు స్వీకరించిన న్యాయస్థానం, ఈ కేసులో ఆయనకి నోటీసులు జారీ చేసింది. అది కూడా తెలంగాణలోని కరీంనగర్‌ న్యాయస్థానం కావడం మరింత విశేషమిక్కడ. కోర్టు నోటీసుల ప్రకారం చూస్తే, ఏప్రిల్‌ 20న కోడెల శివప్రసాద్‌ కరీంనగర్‌ న్యాయస్థానం యెదుట హాజరు కావాల్సి వుంటుంది. 
 
ఎన్నికల ఖర్చు పెరిగిపోయిందని చెబుతూ, దానికి ఉదాహరణగా తాను చేసిన ఖర్చుల గురించి చెప్పి, కోడెల శివప్రసాద్‌ అడ్డంగా బుక్కయిపోయారు. అన్నట్టు, కోడెల వ్యాఖ్యల్లో ఉద్దేశ్యం వేరనీ, ఒక్కోసారి మాటల్లో తప్పులు దొర్లుతాయనీ, 11 కోట్లు కాదు, 11 లక్షలు అయి వుంటుందని టీడీపీ నేతలు ఆ మధ్య బుకాయించార్లెండి. న్యాయస్థానం యెదుట హాజరైతే కోడెల కూడా ఇదే కథ చెబుతారేమో.
 
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో 2014 ఎన్నికల సమయంలో (అప్పటికింకా ఉమ్మడి తెలుగు రాష్ట్రమే) ఎమ్మెల్యే టిక్కెట్‌ కోసమే పది కోట్ల దాకా పలికిన సందర్భాలున్నాయి. టిక్కెట్లను కొనుక్కోవాల్సిన దుస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ కొందరు మీడియాకెక్కారు కూడా.! ఎన్నికల్లో ఖర్చులు పెరిగిపోతున్నాయని కోడెల చెప్పిన మాటల్లో వాస్తవం లేకపోలేదు. కానీ, అలా 11 కోట్లు ఖర్చు చేసి ఎమ్మెల్యే అయిన వ్యక్తి స్పీకర్‌ పదవిలో కూర్చోవడమా. అదీ ఎన్నికల నిబంధనల గురించి. అన్నదే ఇక్కడ చర్చ.
 
ఇది ఒకటే కాదు.. మొన్నటికి మొన్న అమరావతిలో జరిగిన అంతర్జాతీయ మహిళా పార్లమెంటు సందర్భంగా కూడా మహిళలను షెడ్డులోని కార్లతో పోల్చి కార్లు షెడ్లో భద్రంగా ఉంటాయి, బయటకి వస్తే యాక్సిడెంట్లకు గురవుతాయి. మహిళలు కూడా అంతే. ఇంట్లో ఉంటే భద్రంగా ఉంటారు. ఇల్లు దాటి బయటకు వస్తే అన్ని ప్రమాదాలకూ గురవుతారు అంటూ ఆడవారిని షెడ్ లోని కార్లతో పోల్చి కోడెల ఎంత అభాసుపాలు కావాలో అంత అయ్యారు. చంద్రబాబు అవుట్ రైట్‌గా సమర్ధించినా కోడెలపై పడ్డ మచ్చ ఇంకా పోలేదు. తన కుటుంబంలో సొంత కోడలు తన వ్యవహారం గురించి చెప్పింది చూస్తే కోడెల పచ్చి భూస్వామ్య మనస్తత్వంతో ఉన్నారని తేలిపోతుంది. భూస్వామ్య మనస్తత్వం కాబట్టే కోడెల నోరు విప్పినప్పుడు వెనకాముందు చూసుకోరని అంటున్నారు. 
 
ఏదేమైనా కోడెల తన నోటికి భయపడాల్సిన అవసరం దగ్గరపడింది మరి.