బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (11:03 IST)

వంట మనుషులతో జాగ్రత్త.. ఆహారంలో మత్తుమందు పెట్టిన నేపాల్ జంట

నేపాల్‌కు చెందిన ఓ జంట కోకాపేటలోని ఓ విల్లాలో పని మనుషులుగా చేరింది. వారం రోజులు అయిందో లేదో ఇంటి యజమానులకు ఆహారంలో మత్తుమందు కలిపిచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించింది. దొంగిలించిన సొత్తుతో నేపాల్‌కు పారిపోయే క్రమంలో నార్సింగి పోలీసులకు పట్టుబడింది. వివరాలు.. కోకాపేటలోని ఆరిస్టోస్‌ పౌలోమీ విల్లా 44లో ఓ వ్యాపారి తన భార్య, కుమార్తెతో కలసి నివసిస్తున్నారు. 
 
డిసెంబర్‌ 27వ తేదీన ఇంట్లో పనిచేసేందుకు ఓ ఏజెన్సీ నుంచి నేపాలీ జంటను కుదుర్చుకున్నారు.
 
జంటలోని మహిళ తనను పవిత్రగా పరిచయం చేసుకుని ఇంటిలోని వారితో కలివిడిగా ఉంటోంది. దీంతో ఆ ఇంటిలోని వారికి తమపై నమ్మకం పెరిగేలా చేసుకుంది.ఆ ఇంట్లో మనుషుల వ్యక్తిత్వంతోపాటు విలువైన వస్తువులు ఎక్కడెక్కడ దాచారో ఈ జంట వారం పాటు గమనించింది. 
 
ఇక అన్ని కుదరడంతో 3వ తేదీ రాత్రి మత్తుమందు కలిపిన భోజనాన్ని యజమాని కుటుంబానికి పెట్టారు. వారు మత్తులోకి జారుకున్న అనంతరం బంగారు ఆభరణాలతో పాటు నగదు, వెండి వస్తువులు, విలువైన దుస్తులను 4 బ్యాగుల్లో సర్దుకుని వారిద్దరు ఉడాయించారు. 4వ తేదీ మధ్యాహ్నం గచ్చిబౌలిలో ఉండే ఆ వ్యాపారి మరో కుమార్తె విల్లాలోని కుటుంబసభ్యులకు ఫోన్‌ చేయగా ఎవరూ స్పందించలేదు. దీంతో ఆమె మధ్యాహ్నం 4.30 గంటల సమయంలో విల్లాకు వచ్చి తలుపులు తీసిలోనికి వెళ్లింది.
 
కుటుంబసభ్యులంతా ఎక్కడి వారు అక్కడే పడిఉండటంతోపాటు కళ్లు తెరవకపోవడంతో అంబులెన్స్‌కు ఫోన్‌ చేసింది.
 
ఇంట్లోని వస్తువులు చిందరవందరగా ఉండటంతో విల్లా అసోసియేషన్‌ సభ్యులు, సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించింది. దీంతో వారు నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మత్తులో ఉన్న ముగ్గురిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం, బీరువా లాకర్‌ తెరిచి ఉండటంతో ఇదంతా పనిమనుషుల పనేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 
 
సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నేపాలీ జంట ఫొటోలను ఇతర రాష్ట్ర పోలీసులకు చేరవేశారు. వీరిది అంతర్రాష్ట్ర ముఠా అని నిర్ధారించుకున్న పోలీసులు వారి సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా నేపాల్‌కు పారిపోయే క్రమంలో పట్టుకున్నట్టు తెలిసింది. వీరిపై గతంలో కూడా కేసులు నమోదైనట్లు సమాచారం.