శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 12 ఆగస్టు 2019 (18:32 IST)

కృష్ణానది ఉగ్రరూపం... సాగర్‌ గేట్ల ఎత్తివేత

ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. ఆల్మట్టి, నారాయణ్‌పూర్‌ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ కళకళలాడుతున్నాయి. వరద ఉద్ధృతి కొనసాగుతున్నందున సోమవారం సాగర్‌లో 26 గేట్లను పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అధికంగా ఉండటంతో నాగార్జునసాగర్‌ జలకళ సంతరించుకుంటోంది. 
 
ఆదివారం శ్రీశైలంలో 10 గేట్లను ఎత్తి నీటిని దిగువన నాగార్జున సాగర్‌లోకి వదిలారు. నిన్నటి నుంచి భారీ ప్రవాహం సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతోంది. సాగర్‌కు 8.25 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో అధికారులు 24 గేట్లను పైకెత్తారు. ఒక్కోగేటును 5 అడుగుల మేర పెకెత్తి 65,105 క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు.
 
 
 
నిండునున్న పులిచింతల..
ప్రవాహం మరికొంత పెరిగితే ప్రాజెక్టులోని మొత్తం గేట్లను ఎత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సోమవారం రాత్రికే దిగువనున్న పులిచింతల ప్రాజెక్టు కూడా నిండే అవకాశం ఉంది. సాగర్‌ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 559.20 అడుగులు నమోదైంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 225 టీఎంసీలు నమోదైంది. 
 
దీంతో సాగర్‌ పరివాహాక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో జూరాల, శ్రీశైలం జలాశయాలు నిండుకుండలా మారియి. కాగా ప్రాజెక్టుల ఆయకట్టుకు  ఏపీ, తెలంగాణ మంత్రులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. దీంతో శ్రీశైలం, సాగర్‌ ఆయనకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 
 
నిండుకుండలా శ్రీశైలం
ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ప్రస్తుతం 7.53 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 8.51 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో ఉంది. జలాశయం 10 గేట్లను 42 అడుగుల మేర పైకెత్తి నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జలవిద్యుత్‌ కేంద్రాల ద్వారా 8,20,162 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడుకి 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2,363 క్యూసెక్కులు, ముచ్చుమర్రికి 735క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 878.60 అడుగులు నమోదైంది. 
 
పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.81 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 180.26 టీఎంసీలు ఉంది.
సాగర్‌కు పర్యాటకుల తాకిడి నాగార్జునసాగర్‌కు జలకళ సంతరించుకోవడంతో అక్కడికి పర్యాటకుల తాకిడి పెరిగింది. మాచర్ల వైపు నుంచి సాగర్‌కు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వెళతున్నారు. బక్రీద్‌ సెలవుతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం వద్ద కూడా పర్యాటకులు సందడి నెలకొంది. ప్రాజెక్టు అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో డ్యాం వద్ద అధికారులు భద్రతను మరింత పటిష్టం చేశారు.