జై జగన్ అంటూ యూ ట్యూబ్‌లో ఇసాక్ రిచర్డ్స్... ట్రోల్స్ స్టార్ట్...
విదేశాల్లో పుట్టి, విదేశాల్లో పెరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి తెలుగు నేర్చుకున్నాడు ఇసాక్ రిచర్డ్స్. విశాఖపట్నంకు చెందిన ఒక కుటుంబం అమెరికాకు వెళ్ళినప్పుడు తీసిన వీడియో కాస్త ఫేస్ బుక్‌లో పెట్టడంతో ఇసాక్ రిచర్డ్స్ ఎవరో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలిసింది. ఇసాక్ రిచర్డ్స్‌ను ప్రతి తెలుగువారు అభినందించారు.
తెలుగు టీవీ ఛానళ్లయితే అతనితో ప్రత్యేకంగా డిబేట్‌లే పెట్టేశాయి. తెలుగు అంటే తనకు ఎంతో ఇష్టమని.. తెలుగు భాషను గౌరవిస్తానని.. అందుకే తెలుగు నేర్చుకున్నానని, తెలుగు స్పష్టంగా మాట్లాడేందుకు తాను మొదట్లో ఇబ్బంది పడ్డా... ఆ తరవాత భాష నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోయిందని చెప్పుకొచ్చాడు ఇసాక్ రిచర్డ్స్.
అయితే ఇప్పుడు ఉన్నట్లుండి ఇసాక్ రిచర్డ్స్‌ను తెలుగు వారే తిట్టిపోస్తున్నారు. అందుకు ప్రధాన కారణం జై.. జగన్ అంటూ ఇసాక్ నినాదాలు చేయడమే. ఈ నెల 17వ తేదీన డల్లాస్‌లో జరిగే తెలుగు వారి కార్యక్రమంలో జగన్ పాల్గొనబోతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలోనే ఆయన ఆ కార్యక్రమానికి హాజరవుతారు.
ఆ కార్యక్రమంలో తను కూడా పాల్గొంటున్నానని, ఎవరైనా తెలుగువారు తనతో వచ్చి మాట్లాడవచ్చని ఒక వీడియో పోస్ట్ చేశాడు ఇసాక్ రిచర్డ్స్. అయితే అందులో జగన్ కూడా పాల్గొంటాడని చెప్పిన ఇసాక్.. ఉన్నట్లుండి వీడియో చివరలో జై జగన్ అంటూ నినాదాలు చేశారు. దీనిపై నెటిజన్లు బాగా ఫైరవుతున్నారు. నిన్ను సామాన్య వ్యక్తిగా.. తెలుగును అభిమానించే మనిషిగా గౌరవిస్తున్నాము... నీకు రాజకీయాలెందుకు.. ఇలాంటివి మరోసారి చెప్పొద్దు అంటూ నెటిజన్లు ఇసాక్ ను సీరియస్ వార్నింగే ఇస్తున్నారు.
తెలుగువారి అభిమానాన్నే ఇంతవరకు చూసిన రిచర్డ్స్..ఉన్నట్లుండి తిట్లు దండకం ప్రారంభమవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడట. మరి చూడాలి తన పంథాను ఇసాక్ మార్చుకుంటాడో..లేకుంటే ఇలాగే కొనసాగుతాడో.. చూడండి వీడియో...