కాలిఫోర్నియాలో ప్లేగ్రౌండ్ ఓపెనింగ్‌ను అడ్డుకున్న ఒక పిట్ట
సాధారణంగా మనుషి తలచుకుంటే భూమిమీద ఏ ప్రాణిని అయినా కష్టాల్లోకి నెట్టగలడు. అయితే కాలిఫోర్నియాలో కొందరు కష్టపడి నిర్మించుకున్న పాఠశాల, ప్లే గ్రౌండ్‌ను ఓపెన్ చేయనీకుండా ఓ పక్షి అడ్డుకుంది. అదెలా సాధ్యం అనుకుంటున్నారా అయితే ఈ కథనం చదవండి.
రియో అమెరికానో హైస్కూల్లో విద్యార్థులకు క్రీడామైదానం సరిగాలేకపోవడంతో దీన్ని పునరుద్ధరించాలని పాఠశాల యాజమాన్యం నిర్ణయించింది. దీనికోసం సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి విరాళాలు సేకరించింది. సేకరించిన డబ్బుతో ఆటస్థలం, స్కోర్‌బోర్డులు, మరుగుదొడ్లు అన్నీ ఏర్పాటు చేసింది. ఇక గ్రౌండ్ ఓపెనింగే తరువాయి అనుకుంటుండగా వారికి అనుకోని సమస్య వచ్చిపడింది. ఆ క్రీడామైదానం చివర్లో కిల్‌డీర్ అనే అరుదైన జాతి పక్షి గూడు పెట్టుకుని ఉంది.
అక్కడి చట్టాల ప్రకారం, ఈ పక్షులకు ఎటువంటి హానీ చేయకూడదు. దాంతో ఆ పక్షి నిర్మించుకున్న గూడు చుట్టూ పాఠశాల యాజమాన్యం కంచె వేసింది. ఆ పక్షి పెట్టిన గుడ్లు పిల్లలుకాగానే అవి వెళ్లిపోతాయని, అప్పటివరకు మైదానం ప్రారంభోత్సవం చేయడం కుదరదని చెప్పింది. ఆ పక్షుల గుడ్లు పిల్లలు కావడం కోసం దాదాపు నెలరోజుల పాటు విద్యార్థులందరూ ఎదురు చూసారు.
ఇటీవలే పాఠశాల యాజమాన్యం ఆ పక్షులు వెళ్లిపోయాయని వచ్చే వారం మైదానం ప్రారంభోత్సవం జరగనుందని శుభవార్త చెప్పింది. అంత ఖర్చుపెట్టి నిర్మించుకున్న క్రీడామైదానంలో ఆటలాడటానికి ఇన్ని రోజులు వేచిచూడటం ఇబ్బందిగా అనిపించిందని విద్యార్థులంటున్నారు. ఇవే పిట్ట కష్టాలంటే అంటూ స్థానికులు నవ్వుతున్నారు.