గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (16:45 IST)

ఫుట్‌బాల్ మైదానం కంటే పెద్దదైన విమానం వచ్చేసింది...

విశాలమైన రెక్కలతో... ప్రపంచంలోనే అత్యంత పెద్దదని చెబుతున్న విమానం తొలిసారి గాల్లోకి ఎగిరింది. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ ఆల్లెన్ 2011లో స్థాపించిన స్ట్రాటోలాంచ్ కంపెనీ ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారుచేసింది. ఉపగ్రహాలకు ఫ్లయింగ్ లాంచ్‌ప్యాడ్‌లా పని చేయడానికి ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించారు. అయితే, ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి ముందు 10 కి.మీ. దూరం విమానాన్ని నడిపారు.
 
దీని రెక్కల పొడవు 385 అడుగులు. అంటే... అమెరికాలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ విస్తీర్ణం కంటే ఎక్కువని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తక్కువ ఖర్చుతో పంపించొచ్చు. విమానంలో ప్రధాన భాగాన్ని ఫ్యూస్లేజ్ అంటారు. ఈ విమానంలో రెండు ఫ్యూస్లేజ్‌లు ఉన్నాయి. ఇందులో మొత్తం 6 ఇంజిన్లు ఉంటాయి.
 
ఈ విమానం మొదటిసారిగా గంటకు 274కి.మీ. వేగంతో, 15 వేల అడుగులదాకా ఎగిరింది. పైలట్ థామస్ మీడియాతో మాట్లాడుతూ, ఈ విమానాన్ని నడిపిన అనుభవం అద్భుతంగా ఉందని, అంతా అనుకున్నట్లుగానే జరిగిందన్నారు. ''ఈరోజుల్లో విమానాలు అందుబాటులో ఉన్నంత సాధారణంగానే, భూ కక్ష్యను కూడా ప్రయోగాలకు అందుబాటులో తేవడమే మా లక్ష్యం'' అని స్ట్రాటోలాంచ్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
 
బ్రిటన్‌లో రిచర్డ్ బ్రాన్సన్ అనే కోటీశ్వరుడికి చెందిన 'వర్జిన్ గ్లాక్టిక్' అనే కంపెనీ కూడా రాకెట్లను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఓ ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించింది. స్ట్రాటోలాంచ్.. తమ విమానమే ప్రపంచంలో అత్యంత పెద్దదని చెబుతోంది. కానీ ముందు నుంచి వెనకభాగం వరకు కొలిస్తే, దీనికన్నా పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఉన్నాయి.